యురేనియం ..ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు... "యురేనియం తవ్వకాలు - మానవాళికి ప్రమాదం" అనే అంశంపై విజయవాడలో అఖిల పార్టీ నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఆళ్లగడ్డలో అన్వేషణ ఆపాలి
ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం కోసం అన్వేషణ చేస్తున్నారు. యురేనియం ఎక్కడుందో తెలుసుకునేందుకు 1500 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. కడప జిల్లా బాధితులకు న్యాయం చేయకుండా తాజాగా రైతులకు చెప్పకుండా ఆళ్లగడ్డలో యురేనియం నిక్షేపాల అన్వేషణ చేయటం సరికాదని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ప్రస్తుతం ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్‌ను నిలిపివేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో యురేనియం తవ్వకాలపై వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు . ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం అన్వేషణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని... త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలందరు తీర్మానించారు . కడప జిల్లాలో యురేనియం ప్రభావం చూపుతున్న గ్రామాల ప్రజలకు పంటనష్టం ,ఆరోగ్యానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ గనుల తవ్వకాల నిలిపివేతకు జీవో విడుదల చేసింది . అదేవిధంగా యురేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ జీవో విడుదల చేయాలని అఖిల పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలు ఆపకుంటే కలసికట్టుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
పరిహారం అందించాలి
మరోవైపు యురేనియం తవ్వకాల ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని కడప జిల్లా కేకే మండలం వాసులు ఆందోళన చెందుతున్నారు. పంటపొలాలు నష్టపోవటమే కాకుండా శరీరంపై హటాత్తుగా దద్దుర్లు రావటం, పిల్లలకు వైకల్యం సోకడం వంటి పరిణామాలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారం చెల్లించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి
ఊరు ఊపిరికి..'ఉరే'నియం