Alert at Railway stations: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. దాడులు జరగవచ్చన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. అన్ని రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను మోహరించారు.
విజయవాడ రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో.. అధికారులు భద్రత పెంచారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌కు అదనంగా 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌లోకి టికెట్లు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. స్టేషన్ ోలని అన్ని గేట్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలతో.. ప్రయాణికులను పరిశీలిస్తున్నారు.
యువకులు, విద్యార్థులు ఆందోళనకు దిగొద్దని సీపీ కాంతి రాణా టాటా సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతపై కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు.
గుంటూరు రైల్వేస్టేషన్‌లోనూ భారీగా పోలీసులను మోహరించారు. చలో గుంటూరు కార్యక్రమం జరుగుతుందనే నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు.. ఆర్మీ నియామక బోర్డు వద్ద భద్రతను పెంచారు. ఆర్మీ కార్యాలయానికి వెళ్లే దారిని మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్వ వేక్షిస్తున్నారు. కొత్తపేట స్టేషన్‌కు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో పలువురు ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు.
రైల్వే స్టేషన్‌లో భద్రతను.. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏఎస్పీ అనిల్‌కుమార్ పరిశీలించి.. సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఎవరైనా అభ్యర్థులు శాంతియుతంగా అభిప్రాయాలను చెప్పాలని.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే 200 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
విశాఖపట్నంలో రైల్వేస్టేషన్‌ను మధ్యాహ్నం 12 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరికీ అనుమతి లేదన్న అధికారులు.. విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద నిలిపివేయగా.. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. హవ్‌డా, విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ కొత్తవలస వద్ద నిలిపివేసి.. దారి మళ్లిస్తున్నారు. విశాఖ స్టేషన్‌కు రైళ్లు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్ ముందే అన్నివైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల వరకు ఉన్న ప్రయాణికులకే తనిఖీల అనంతరం అనుమతిచ్చారు. స్టేషన్ రోడ్డులోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రత వ్యవహారాలను పోలీసు కమిషనర్ శ్రీకాంత్ స్వయంగా పరిశీలిస్తున్నారు. విశాఖలో పలువురు విద్యార్థి సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్‌ను సైతం.. అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే స్టేషన్ వద్ద ఉన్నతాధికారులు ఆకస్మిక తనీఖీలు చేపట్టారు. స్టేషన్ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్టేషన్‌కు ఎలా చేరుకోవాలో వాట్సాప్ సందేశాలు ఇస్తున్నట్లు గుర్తించారు.
కంచరపాలెం గేట్, మర్రిపాలెం హాల్ట్, సింహాచలం స్టేషన్ల వద్ద.. అధికారులు భద్రత పెంచారు. మద్దిలపాలెం, జ్ఞానాపురం ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రైల్వే కల్యాణమండపం జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్‌కు దూరంగా.. బస్సులు ఆపివేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. లగేజీతో ఎక్కువ దూరం నడవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.