ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నటుడు అంబరీష రూపొందించిన సిరివెన్నెల, వేటూరి ఖతుల ఆవిష్కరణ - telangana varthalu

కమ్మదనాన్ని పంచే అమ్మభాష.. అంతర్జాతీయ స్థాయిలో వెలుగులీనలేక పోతోంది. ఆంగ్ల అక్షరాలకున్న హంగులు... తెలుగులో కానరావే అని భాషాభిమానులు అసంతృప్తి చెందుతుంటారు. ఈ సమస్యను గ్రహించిన ఓ సినీనటుడు... మాతృభాషపై మమకారంతో రకరకాల తెలుగు ఫాంట్స్‌ను స్వయంగా తయారుచేస్తున్నారు. భాషాభిమానులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటివరకు 10కిపైగా తెలుగు యూనికోడ్ ఫాంట్స్‌ను విడుదల చేసిన ఆ నటుడు.. మరో 30 ఫాంట్స్‌ను తీర్చిదిద్దారు.

తెలుగు వర్ణమాలను అందంగా తీర్చిదిద్దుతున్న అంబరీష
తెలుగు వర్ణమాలను అందంగా తీర్చిదిద్దుతున్న అంబరీష

By

Published : Feb 21, 2021, 5:10 AM IST

అప్పాజీ అంబరీష... తెలుగు సినిమా నటుడు. సుమారు 75కుపైగా చిత్రాల్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. తండ్రి పాత్రల్లో, రాజకీయ నాయకుడి పాత్రల్లో కనిపిస్తుంటారు. నటుడి కంటే ముందు అంబరీష.. తెలుగు భాషాభిమాని. భాషపై ఇష్టంతో తెలుగు వర్ణమాలను అందంగా ముస్తాబు చేస్తుంటారు. తెలుగు భాషకు వెలుగులు తెచ్చే క్రమంలో అంబరీష స్వతహాగానే 30 రకాల యూనికోడ్ తెలుగు ఫాంట్స్‌ను తయారు చేశారు. వాటిని ఉచితంగా మార్కెట్‌లోకి విడుదల చేసి... డిజిటల్ ప్రపంచంలో తెలుగుభాషను పరుగులు పెట్టించేందుకు తనవంతు పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు వర్ణమాలను అందంగా తీర్చిదిద్దుతున్న అంబరీష

భాషపై మమకారం

అంబరీష తండ్రి రాంషా ప్రింటింగ్ ప్రెస్ నడిపించేవారు. అంబరీష అందులో పనిచేస్తూ భాషపై మమకారాన్ని పెంచుకున్నారు. మామయ్య మిర్యాల రామకృష్ణ కూడా రచయిత కావడంతో తెలుగు సాహిత్యంపై ఇష్టం పెరిగింది. ఎంఏ తెలుగు సాహిత్యం చదివిన అంబరీష.. ముద్రణ రంగంలో వచ్చిన సాంకేతిక మార్పులను అందిపుచ్చుకున్నారు. సీసం అక్షరాలు పోయిన తర్వాత డిజిటల్‌లో రాయడం స్వతహాగానే అలవర్చుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు ఫాంట్స్ దొరకకపోవడం రచయితలకు పెద్ద సమస్యగా ఉండేది. ఈ సమస్యను గుర్తించిన అంబరీష... తెలుగు ఫాంట్స్ ఉచితంగా తయారు చేయాలని భావించారు. అప్పుడు అంతా ఆయన్ని హేళన చేశారు. ఐనా... ముందడుగు వేశారు.

ఈజీ ఫాంట్స్​కు రూపం

హైదరాబాద్ వచ్చిన అంబరీష బేగంపేటలోని ఓటీఎస్ వాణిజ్య ప్రకటనల సంస్థలో క్రియేటివ్ డిజైనర్‌గా చేరారు. ఇమేజిన్ అనే కంపెనీ తెలుగు ఫాంట్స్ తయారు చేయాలని భావించి మధ్యలో మానేసిందని తెలుసుకున్నారు. ఆ కంపెనీలో చేరి తెలుగు ఫాంట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా... తొలిసారిగా చతుర, సౌందర్య డెకరేటివ్‌, పద్మిని డెకరేటివ్ వంటి 14 రకాల ఈజీ ఫాంట్స్‌కు రూపమిచ్చారు. రచయితలకు ఎదురైన ప్రింటింగ్ సమస్యను అధిగమించేందుకు శ్రీలిపి, అను ఫాంట్స్ కన్వర్టర్లను తయారు చేశారు. అవి అందుబాటులోకి రావడంతో చాలా డీటీపీ సెంటర్లు, రచయితలకు పుస్తకాల ముద్రణ తేలికగా మారింది.

2 వేల 75 కాంబినేషన్లలో..

ఫాంట్స్ తయారీలో ఎన్నో మార్పులొచ్చాయి. యూనికోడ్ కన్సార్టియం ఏర్పడింది. ఎవరు ఫాంట్స్ తయారు చేసినా అక్షరానికి ఒకటే వాల్యుమ్ ఉండేలా నియమం పెట్టారు. తెలుగులో కంటే ఆంగ్లంలోనే ఎక్కువగా ఫాంట్స్ సిద్ధమయ్యాయి. ఈ దశలో 2014లో తొలిసారిగా అంబరీష యూనికోడ్‌లో రమణీయ ఫాంట్స్ తయారు చేశారు. ఆ ఫాంట్స్‌ను విజయవాడలో జరిగిన కృష్ణా రచయితల మహాసభలో ఆవిష్కరించారు. చాలా మందికి ఆ ఫాంట్స్ నచ్చడంతో మరిన్ని తయారు చేయాలని అంబరీషను కోరారు. అందరికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తేనే ఫాంట్స్ తయారు చేస్తానని అంబరీష్ నిబంధన పెట్టారు. ఆ నిబంధనకు అంగీకరించి నిర్వాహకులు సహకరించడంతో అనతికాలంలోనే అంబరీష... యూనికోడ్‌లో పొన్నాల, రవిప్రకాశ్, లక్కిరెడ్డి ఫాంట్స్ తయారు చేశారు. ఈజీ ఫాంట్స్‌లో 250 క్యారెక్టర్స్‌కే పరిమతిమైన ఫాంట్స్ తయారీని మార్చివేసిన అంబరీష... 2 వేల 75 కాంబినేషన్లలో ఫాంట్స్ తయారు చేసి చూపించారు.

తీరిక వేళల్లో ప్రయోగాలు

ఆంగ్ల భాషలో వచ్చే ఫాంట్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా తెలుగు ఫాంట్స్‌ను తీర్చిదిద్దాలనే తపనతో ఉండే అంబరీష తీరికవేళల్లో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పాత సినిమా పేర్లు, పుస్తకాల్లోని శీర్షికల్లో ఆకర్షణీయంగా కనిపించే వాటిని సేకరించి.. వాటిని మిగతా అక్షరాలను కూడా అదే రూపంలో తీర్చిదిద్దుతారు. అలాగే సినిమా చిత్రీకరణ సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ గోడలపై కనిపించే అక్షరాలను ఫొటోల్లో బంధించడం, ఆ తర్వాత వాటిని మరింత అందంగా రాయడంతో సరికొత్త ఫాంట్స్ అంబరీష సృష్టిస్తున్నారు. ఒక్కో ఫాంట్ తయారు కావాలంటే సుమారు 400 నుంచి 500 గంటల సమయం వెచ్చించాలి. ఆర్థికంగా ఖర్చుపెట్టాలి. ఫాంట్స్ తయారీకి అంత స్థోమత లేని అంబరీష... దాతల సహాయాన్ని కోరుతున్నారు. ప్రభుత్వాల సాయం కోరినా ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు.

ఫాంట్స్​ ఆవిష్కరణ

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తను తయారు చేసిన తెలుగు ఫాంట్స్‌లో సిరివెన్నెల, వేటూరి ఫాంట్స్‌ను అంబరీష విడుదల చేస్తున్నారు. ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ ఫాంట్స్​ను ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వాలు, చిత్ర పరిశ్రమ సహకరిస్తే... తెలుగు ఫాంట్స్‌ను ఉచితంగా అందిస్తానంటోన్న అంబరీష... భాషాభిమానులంతా కలిసిరావాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కాఫర్‌ డ్యాం నిర్మాణ తీరు మారాలి.. పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సిఫార్సు

ABOUT THE AUTHOR

...view details