Paper leaks: పదో తరగతి ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపేవారిపైన, వాటిని షేర్ చేసేవారిపైనా కేసులు నమోదు చేస్తామని.. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. పరీక్షల చట్టం 25/97 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశ్నపత్రాన్ని షేర్ చేసిన వారు శిక్షార్హులేనన్నారు. ఫోన్‌కు ఎవరైనా ప్రశ్నపత్రం పంపితే దాన్ని ఎవరికీ షేర్ చేయకుండా ఎక్కడినుంచి వచ్చిందన్న విషయాన్ని సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో గానీ, మండల విద్యాధికారికి గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.
పరీక్షల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండాలని, ఎవరైనా ప్రైవేటు వ్యక్తులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించినా, మొబైల్‌ఫోన్లు కనిపించినా చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. రంజాన్ పండుగను ఏ తేదీన నిర్వహించుకున్నా పరీక్షల తేదీల్లో మార్పులు ఉండవని వెల్లడించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం..: పదో తరగతి పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు బయటకు రావడానికి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని.. ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణరెడ్డి, శ్రీనివాసరావు విమర్శించారు. ‘‘పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను సరి చేయడం లేదు. ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. తగినంత భద్రతా సిబ్బందిని నియమించాలి. క్లర్క్‌కు రోజుకు రూ.22, వాటర్‌మెన్‌కు రూ.11 మాత్రమే ఇస్తున్నారు. దీనికి పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రతి తప్పులోనూ చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారులుగా పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. నిర్వహణలో వైఫల్యం చెందిన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు’’ అని వెల్లడించారు.
- పదో తరగతి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని రాయలసీమ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ సురేష్‌బాబు డిమాండ్ చేశారు. ‘‘వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా పది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా నిర్ణీత పరీక్షా సమయం కంటే ముందే వాట్సప్‌లో ప్రశ్నపత్రం రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. పరీక్షలకు సంబంధించి రోజూ రాష్ట్రంలో ఎక్కడోచోట ప్రశ్నపత్రం లీక్ అవుతూనే ఉంది. భద్రత అన్నది కలగా మారింది’’ అని విమర్శించారు.
ఇదీ చదవండి:
'తుమ్మలపల్లి యురేనియం కర్మాగార అణు వ్యర్థాల ప్రభావంపై నివేదిక ఇవ్వండి'