ACHARYA TEAM: మెగాస్టార్ చిరంజీవి, రామ్చర్ణ్ కథానాయకులుగా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలను పురస్కరించుకొని హీరో రామ్‌చరణ్, దర్శకుడు కొరటాల శివ తదితరులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో చిత్ర బృందానికి స్వాగతం పలికారు. అమ్మవారికి రామ్‌చరణ్ పసుపు, కుంకుమ, చీర మొదలైనవి సమర్పించారు.
తరలివచ్చిన అభిమానులు.. :ఉదయం పదకొండు గంటల తర్వాత చిత్ర బృందం ఆలయానికి చేరుకుంది. అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు ఆలయ ప్రాంగణంలో జై చరణ్ అంటూ పెద్ద ఎత్తున తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో దుర్గమ్మ నామస్మరణ తప్ప వేరే ఏమీ చేయకూడదని ఆలయ సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఎవరూ వినిపించుకోలేదు. చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టతరమైంది. పోలీసులు, ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు తోసేసి మరీ ఆలయం లోపలికి దూసుకెళ్లారు. పోలీసులు, ఆలయ సిబ్బంది, బౌన్సర్ల భద్రతతో అతి కష్టం మీద రామ్‌చరణ్, కొరటాల శివ ఆలయంలోకి ప్రవేశించారు.
అంతరాలయంలో చరణ్ దర్శనం చేసుకుంటున్న సమయంలో అభిమానులు ఆలయంలో నుంచి సెల్‌ఫోన్లతో దృశ్యాలు చిత్రీకరించడంతో పోలీసులు ఒక దశలో ఆలయ తలుపులు మూసేసే ప్రయత్నం చేశారు. అమ్మవారి మూల విరాట్‌ను ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయరాదంటూ ఈవో జోక్యం చేసుకుని భద్రతా సిబ్బంది సహాయంతో సెల్‌ఫోన్లలో చిత్రీకరణను నిలిపివేయించారు. కొన్ని ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాలను తొలగింపజేశారు.