ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JOB NOTIFICATIONS: ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణలో త్వరలోనే నోటిఫికేషన్లు..!

JOB NOTIFICATIONS: తెలంగాణలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఒకటి, రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 34 వేల ఉద్యోగాల భర్తీకి సర్కార్ అనుమతించింది. నోటిఫికేషన్ల జారీకి ముందు చేయాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కసరత్తు నెలాఖరులోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. అటు స్థానికత నిర్ధరణ కోసం ఓటీఆర్‌లో సవరణ చేసుకునేందుకు అభ్యర్థులు ఇంకా అంతగా ఆసక్తి చూపడం లేదు. 20 లక్షలకు పైగా అభ్యర్థులకు గానూ సవరణ చేసుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు లక్షన్నరలోపే ఉన్నట్లు సమాచారం.

JOB NOTIFICATIONS
తెలంగాణలో త్వరలోనే నోటిఫికేషన్లు

By

Published : Apr 15, 2022, 10:01 AM IST

JOB NOTIFICATIONS: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ కోసం కసరత్తు కొనసాగుతోంది. 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు దఫాలుగా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. 503 గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాల నియామకానికి అనుమతులు మంజూరు చేసింది. దాదాపుగా 34 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల అనంతరం ఆయా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసే కసరత్తును పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా ఇతర నియామక సంస్థలు ప్రారంభించాయి.

అందరి దృష్టి గ్రూప్​-1 ఉద్యోగాలపై ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను టీఎస్​పీఎస్సీ చేపట్టింది. ఉద్యోగాలు ఉన్న 19 శాఖల నుంచి అవసరమైన వివరాలు సేకరించింది. అయితే నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉండరాదని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కొంత సమయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఈ మేరకు రాష్ట్రంలో అన్ని ఉద్యోగ నియామకాలకు ముఖాముఖిలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితిని పదేళ్ల పాటు పొడిగించిన నేపథ్యంలో యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకూ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న సర్కార్... కేబినెట్​లో చర్చించి యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకూ గరిష్ట వయో పరిమితిని మూడేళ్ల పాటు పొడిగించింది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పుడే నోటిఫికేషన్​..:ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి టీఎస్​పీఎస్సీకి అవసరమైన వివరాలు పంపారు. అయితే కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన సర్వీసు నిబంధనలతో పాటు ఇతరత్రాలకు సంబంధించి చిన్న చిన్న సవరణలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆ సవరణలు చేయకపోతే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయం ఉన్నట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖ ఉద్యోగాల విషయంలో ఫిజికల్ మెజర్​మెంట్స్​కు సంబంధించీ కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయా శాఖల నుంచి సంబంధిత సవరణల ప్రక్రియ పూర్తి చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు పంపాల్సి ఉంది. ఆ కసరత్తు అంతా ప్రభుత్వం నుంచి పూర్తై టీఎస్​పీఎస్సీకి పంపిన తర్వాతే నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంటుంది. ఈ కసరత్తు వచ్చే వారం లేదా నెలాఖరులోపు పూర్తవుతుందని అంటున్నారు.

మరో 1 లేదా 2 నోటిఫికేషన్లు సైతం..:కమిషన్ పరంగా కసరత్తు దాదాపుగా పూర్తైందని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వివరాలన్నీ అందితే ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరో ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లూ అదే సమయంలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లక్షన్నరలోపే సవరణలు..:కొత్త జోనల్ విధానం ప్రకారం స్థానికత నిర్ధరణ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఓటీఆర్​లో సవరణకు అవకాశం ఇచ్చింది. కానీ, చాలా మంది దానిపట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన పాఠశాల, ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా అభ్యర్థి స్థానికతను నిర్ధారిస్తారు. 20 లక్షలకుపైగా అభ్యర్థులు ఓటీఆర్​లో నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు సవరణ చేసుకున్న వారి సంఖ్య లక్షన్నరలోపే ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details