లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుకు అధికారుల కమిటీ సూచనలు చేసింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను క్రోడీకరించి కొత్త జిల్లాలు, ముఖ్యకేంద్రం, వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలతో నివేదిక రూపొందించింది. ప్రతి జిల్లాలో 2-3 డివిజన్లను ప్రతిపాదించింది.
జిల్లాల హద్దులపై దృష్టిసారించాలి..
బాపట్ల జిల్లాలో కొత్తగా.. బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ దృష్టిసారించాలని సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యం, అటవీ, వాణిజ్యపన్నులు, ఇంజినీరింగ్ తదితర శాఖలు.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. విస్తీర్ణం, జనాభా, ఆదాయం, చారిత్రక అనుబంధాలు, ప్రజాప్రయోజనాలు, సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ప్రస్తావించింది.
మార్పులు- చేర్పులు..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్‌లోకి, ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్‌లోకి చేర్చాలని కమిటీ సూచించింది. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు డివిజన్ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాలను.. కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డిగూడెం డివిజన్‌లోకి చేర్చాలని ప్రతిపాదించింది. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక డివిజన్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్‌లోకి చేర్చాలని సిఫారసు చేసింది.