AP SSC Exams: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నందున.. నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. సహేతుక కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వెళ్లినా అనుమతిస్తామన్నారు.
ఈ ఏడాది 6,22,537మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో బాలికలు 3,02,474మంది ఉన్నారు. 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహేతుక కారణాలతో విద్యార్థులు అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తారు. పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి 12.45గంటల వరకు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి.