TTD EO ON GHAT ROAD ROCK FALLINGS: తిరుపతి - తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డాక్టర్ కెఎస్. జవహర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండవ ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని, వాటి పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు.
VEHICLES GOING TIRUMALA: సాయంత్రం లోపు బండరాళ్లు, మట్టిని పూర్తిగా తొలగిస్తారని ఈవో తెలియజేశారు. మొదటి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని, సాయంత్రం 4 గంటల వరకు తిరుపతి నుంచి తిరుమలకు 2,300 వాహనాలు, తిరుమల నుంచి తిరుపతికి 2,000 వాహనాలు ప్రయాణించాయని తెలిపారు. చెన్నై ఐఐటీ ప్రొఫెసర్లు తిరుమలకు చేరుకుని విరిగిపడిన కొండచరియలను పరిశీలించారని.. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు రేపు (గురువారం) ఘాట్ రోడ్డును పరిశీలిస్తారని తెలియజేశారు.