తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి.. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి సుదర్శన చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి ఆలయంలోనే 9 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. ఈ చక్రస్నాన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
మాములుగా ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం కార్యక్రమంతో ఉత్సవాలు ముగియాలి. అయితే ఈ ఏడాది అధికమాసంలో చేస్తున్న నవరాత్రి రెండో బ్రహ్మోత్సవాలు కనుక ఆ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. దీంతో చక్రస్నాన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.