కోనేటిరాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం స్వామివారు శ్రీవారి సన్నిధి నుంచి తిరుచ్చిపై విమాన ప్రదక్షిణగా కల్యాణ మండపానికి వేంచేశారు. అక్కడ విశేష తిరువాభరణాలతో అలంకార భూషితుడైన స్వామివారు మోహినీ అవతారంలో దంతపుపల్లకిపై దర్శనమిచ్చారు. మరో పల్లకిలో శ్రీకృష్ణుడి రూపంలో అభయమిచ్చారు. రాత్రి ఏడు గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీవారు గరుడవాహనాన్ని అధిష్టించారు.
సదా మూలమూర్తి సమర్పణలో ఉన్న లక్ష్మీకాసులహారం, మకరకంఠి, శ్రీవిల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చిన గోదాదేవి మాలలు శ్రీవారికి అలంకరించారు. చెన్నై నుంచి వచ్చిన శ్వేత క్షత్రాలు గరుడ సేవలో వినియోగించారు. పండితుల వేదమంత్రోచ్చరణలు.. మంగళవాయిద్యాలు.. దివ్యప్రబంధగోష్ఠి, వేదపారాయణం నడుమ గరుడవాహన సేవ కన్నులపండువగా సాగింది.
రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్... శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన... పద్మావతి అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. సీఎం జగన్‌కు ఆలయ ప్రధాన అర్చకులు సంప్రదాయబద్ధంగా పరివట్టం చుట్టారు. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి సన్నిధికి సీఎం చేరుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించాక.. రంగనాయక మండపంలో తితిదే ముద్రించిన 2021 కాలమాన పట్టికలు, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తితిదే ఈవో, ఛైర్మన్.. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను ముఖ్యమంత్రికి అందజేసి సత్కరించారు. అనంతరం సీఎం జగన్.. గరుడ వాహనసేవలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులను అభయప్రదానం చేస్తారు.
కన్నులపండువగా.. కోనేటిరాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇదీ చదవండి: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ అభినందన...ఎందుకంటే?