ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజన రద్దు ! - yv subba reddy

వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి సంకల్పించారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు

By

Published : Jul 2, 2019, 6:46 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి సంకల్పించారు. దీనిపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి.. త్వరలో పూర్తిస్థాయిలో ఏర్పాటు కానున్న ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది అమలులోకి వస్తే.. బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన అందరికీ సమానంగా స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లు మూడు కేటగిరీల్లో విభజించి కేటాయిస్తున్నారు. అత్యంత ప్రముఖులకు లిస్టు-1గా, ఇతరులకు స్థాయిని బట్టి లిస్టు-2గా టికెట్లు మంజూరు చేస్తున్నారు. సాధారణ సిఫార్సులను లిస్టు-3 కింద పరిగణిస్తున్నారు. అన్ని కేటగిరీలకు సిఫార్సు తప్పనిసరి కావడంతో రూ.500 కట్టాల్సిందే. లిస్టు-1 కింద టికెట్లు పొందిన భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఒత్తిడి లేకుండా నిదానంగా స్వామివారి దర్శనం చేయించడంతో పాటు తీర్థం, శఠారీ మర్యాదలు కల్పిస్తారు. వీరి తర్వాత లిస్టు-2 టికెట్లున్న వారిని ఆలయానికి అనుమతిస్తారు. వీరిని గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు అనుమతిస్తారు. అయితే.. స్వామివారిని దర్శించుకుంటూ వేగంగా ముందుకు కదలాల్సి ఉంటుంది. క్షణకాలమూ నిలబడటానికి అనుమతించరు. అనంతరం లిస్టు-3 బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను పంపించి.. మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను మూడు రకాలుగా విభజించడంపై విమర్శలున్నాయి.
16న కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం
శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా తితిదే ఈ నెల 16న కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనుంది. ఆరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం క్రతువు సుమారు 5 గంటల పాటు కొనసాగనుంది. తిరుమంజనం కారణంగా 16న శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. సర్వదర్శనం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి చంద్రగ్రహణం నేపథ్యంలో రాత్రి 7 గంటలకు నిలిపివేయనుంది.

ABOUT THE AUTHOR

...view details