ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబుపై రాళ్ల దాడులు.. తిరుపతిలో తెదేపా గెలుపును ఆపలేవు'

తిరుపతిలో చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి ఘటనపై తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సీఎం జగన్‌ రాళ్లు వేయిస్తే, అదే రాళ్లతో జ‌నానికి ప‌నికొచ్చే నిర్మాణం చేయగ‌ల విజ‌న‌రీ చంద్రబాబు అని నారా లోకేశ్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తిరుపతిలో తెదేపా గెలుపున ఆపలేరని మాజీ మంత్రి యనమల ధీమా వ్యక్తం చేశారు. ఘటనపై ఇవాళ గవర్నర్​ను కలుస్తామని వర్ల రామయ్య తెలిపారు.

tirupati by poll 2021
attack on chandrababu

By

Published : Apr 13, 2021, 7:14 AM IST

తిరుపతిలో చంద్రబాబు వాహనంపైకి రాళ్లు విసిరిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఆ పార్టీ నేతలు గవర్నర్‌ను సమయం కోరారు. చంద్రబాబుపై దాడి వైకాపా రౌడీ మూకల పనేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 'తిరుప‌తి కొండ‌పై 24 క్లైమోర్‌మైన్లు పేల్చి దాడి చేస్తే సాక్షాత్తు ఏడుకొండ‌ల‌ వాడే కాపాడిన ప్రాణం చంద్రబాబుది' అని నారా లోకేశ్‌ అన్నారు. సీఎం జగన్‌ రాళ్లు వేయిస్తే, అదే రాళ్లతో జ‌నానికి ప‌నికొచ్చే నిర్మాణం చేయగ‌ల విజ‌న‌రీ చంద్రబాబు అని అన్నారు. ప్రశ్నించే ప్రజా గొంతును సీఎం జగన్ నులిమే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా నేతలు యనమల, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. గతంలోనూ చంద్రబాబు అమరావతి పర్యటనలోనూ ఇలానే దాడి చేయించారన్నారు. కేవలం రెండేళ్లకే వైకాపా అరాచకపు, మోసపూరిత పాలన ప్రజలకు అర్ధమయ్యిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తిరుపతిలో తెలుగుదేశం విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

మరింత రెచ్చిపోయే ప్రమాదం

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోనూ వైకాపా మూకలు రెచ్చిపోవడం దారుణం. రాష్ట్రంలో మాజీ సీఎంకే భద్రత కొరవడటం జగన్‌ దమన పాలనకు అద్దం పడుతోంది. ప్రచార సమయంలో దాడికి పాల్పడిన వైకాపా... పోలింగ్‌ రోజు మరింత రెచ్చిపోయే ప్రమాదముంది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి. - యనమల, శాసనమండలిలో ప్రతిపక్ష నేత

గవర్నర్​ స్పందించలేదు.. మళ్లీ ప్రయత్నిస్తాం..

ఘటనపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సోమవారం రాత్రి 10 గంటల దాకా ప్రయత్నించాం. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరేందుకు ఫోన్‌ చేయగా... ఆయన కార్యదర్శిగానీ, ఓఎస్‌డీగానీ, కార్యాలయ సిబ్బందిగానీ స్పందించలేదు. మంగళవారం ఉదయం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం, ఆయన స్పందించకపోతే మిగతా రాజ్యాంగబద్ధ వ్యవస్థల తలుపు తడతాం. ‘జగన్‌ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుపతిలో చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగింది. ఇలాంటి గిమ్మిక్కుల్లో ఘనాపాటి అధికార పార్టీ. క్లైమోర్‌మైన్స్‌ దాడికే భయపడని చంద్రబాబు, రాళ్ల దాడికి భయపడతారా..?’- వర్ల రామయ్య, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

ప్రజాగళాన్ని నులిమే యత్నం

జగన్‌రెడ్డి.. ప్రశ్నించే ప్రజాగొంతును నులిమే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలో చంద్రబాబు ప్రచారానికి వస్తున్న ప్రజాదరణ చూసి వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో అమరావతిలోనూ చంద్రబాబుపై ఇలానేదాడి చేయించారు. దాడులు, దౌర్జన్యాలు వైకాపా డీఎన్‌ఏలోనే ఉన్నాయి. ఎన్ని కుట్రలు చేసినా తిరుపతిలో తెదేపా విజయాన్ని ఆపలేరు.- ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ మంత్రి

ఇదీ చదవండి:

'పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులా ?..మీ రౌడీయిజానికి భయపడం'

ABOUT THE AUTHOR

...view details