Veterinary Students: రాష్ట్రంలో పశు వైద్య విద్యార్థులు, పట్టభద్రుల చేపట్టిన నిరవధిక దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తిరుపతి, కడప జిల్లా పొద్దుటూరు, కృష్ణాజిల్లా గన్నవరం, విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాలలో వారం రోజులుగా పశువైద్య విద్యార్థులు, పట్టభద్రులు నియామకాలు చేపట్టాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. విద్యార్థులు ఆందోళనలను విరమింపజేసేందుకు వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ అధికారులు రాష్ట్రంలోని అన్ని పశు వైద్య కళాశాలలో వసతి గృహాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల నిర్ణయంతో ఇవాళ పశు వైద్య విద్యార్థులకు వసతి గృహాల్లో భోజన సౌకర్యం లేకపోవడంతో ఉదయం నుంచి ఉపవాసంతో నిరసన దీక్షలు చేపట్టారు.
పశువైద్య విశ్వవిద్యాలయ అధికారులు తీరును నిరసిస్తూ విద్యార్థులు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేసి అధికారులను విధులకు అనుమతించకుండా అడ్డుకున్నారు. పశువైద్య విద్యను అభ్యసించిన వేలాదిమంది నిరుద్యోగులుగా మారారని, 2018 తర్వాత ఎటువంటి పశువైద్య నియామకాలు జరగకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశువైద్య నియామకాలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విద్యార్థులు తెలిపారు.