తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఉప ఎన్నికలో దొంగఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందన్న ఆయన.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.
వైకాపా ప్రభుత్వం రాజీనామా చేసేవరకు భాజపా-జనసేన ఉద్యమం చేస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఉప ఎన్నిక సమయంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి, నారాయణస్వామికి పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.ఓటర్లను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారని ఆక్షేపించారు. నవరత్నాలు, అభివృద్ధి గెలిపిస్తాయనుకుంటే ఇన్ని దారుణాలు అవసరమా..? అని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందన్నారు.