తిరుమలలోని అద్దె గదిలో భక్తులు మరిచిపోయిన వస్తువులను తిరిగి వారికి అప్పగించి తితిదే ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సతీష్ దంపతులు వకుళామాత అతిథి గృహంలో గది తీసుకున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకుని గది ఖాళీ చేసి తిరుగు పయనమయ్యారు. అనంతరం గదిని పరిశీలించేందుకు వెళ్లిన తితిదే సిబ్బందికి ఆ గదిలో బ్యాగ్ కనపడింది.
గుర్తించిన సిబ్బంది.. గదిని పొందేందుకు ఇచ్చిన వివరాల ఆధారంగా వారికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వసతికల్పన విభాగం డిప్యూటీ ఈవో దామోదరం ఆధ్వర్యంలో భక్తులను పిలిపించి బ్యాగ్ అప్పగించారు. అందులో విలువైన వస్తువులతో పాటు.. రూపాయలు 70వేల నగదు ఉన్నట్లు వారు తెలిపారు. పోగోట్టుకున్నామనుకున్న వస్తువులను తిరిగి అప్పగించినందుకు తితిదే సిబ్బందికి భక్తులు కృతజ్ఙతలు తెలిపారు.