ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కౌలు రైతుల కోసం జై కిసాన్ : పవన్ - pawan latest news

కౌలు రైతులు, అన్నదాతల కోసం ప్రత్యేకంగా జై కిసాన్ కార్యక్రమాన్ని రూపొందిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైకాపా నేతలు అధికారాన్ని అజమాయిషీ కోసం, అలంకారప్రాయానికి తీసుకున్నారని ఆరోపించారు. రజనీకాంత్ ఆశయం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం అందివ్వాలి
రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం అందివ్వాలి

By

Published : Dec 3, 2020, 5:19 PM IST

Updated : Dec 4, 2020, 4:34 AM IST

కౌలు రైతులు, అన్నదాతల కోసం ప్రత్యేకంగా జైకిసాన్‌ కార్యక్రమాన్ని రూపొందిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. తుపాన్లు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా చూడడమే దీని లక్ష్యమని వెల్లడించారు. ఎలా చేస్తే రైతులకు లాభసాటి ధర వస్తుందనే అంశంపై వ్యవసాయ సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. తుపాను ప్రాంతాల్లో 2రోజుల పర్యటనలో భాగంగా పవన్‌కల్యాణ్‌ గురువారం తిరుపతికి వచ్చిన ఆయన... పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ ప్రసంగించారు. వైకాపా నేతలు అధికారాన్ని అజమాయిషీ కోసం, అలంకారప్రాయానికి తీసుకున్నారని ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్న కోసం అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క రోజే కేటాయించారని విమర్శించారు.

‘నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, కడప జిల్లాల నాయకులతో మాట్లాడి నివర్‌ తుపాను వల్ల ఎంత నష్టమైందో తెలుసుకున్నాం. 17 లక్షల ఎకరాల వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. వాలిపోయిన పంట కోయలేక నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రూ.5వేలు, 10వేలిచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదు. మద్యాన్ని ప్రభుత్వమే అమ్మిస్తోంది. ఇసుక రేవులను వారి సంబంధీకులతోనే నిర్వహిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంటున్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్నం పెట్టే రైతుకు రూ.35వేలు ఇవ్వలేరా? ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. క్షేత్ర స్థాయికి పార్టీ నేతలను పంపి ఎంత మేరకు నష్టమైందనే అంచనాల నివేదిక తయారుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాం’ అని తెలిపారు.

కౌలు రైతులకు అండగా ఉంటాం
కౌలు రైతులకు సాయమందేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు విరాళంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. దీనిపై ప్రతి ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలని సూచించారు. ‘నా వంతు సాయానికి కృషి చేస్తా. ఎవరి స్థాయిలో వాళ్లు ఇవ్వొచ్చు. రాజ్యసభ సీటు కోసం రూ.150 కోట్లు, రూ.200 కోట్లు వెచ్చించిన వారు ఇవ్వొచ్చు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్న మీరు ఎంత ఇస్తారని నేతలను ప్రశ్నించాలి’ అని సూచించారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికకు అభ్యర్థిపై జనసేన, భాజపాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు. వైకాపాకు మద్దతిచ్చే దళితులతోనే దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రం బలమైన సీఎంను చూసేది...
చిరంజీవిలాంటి బలమైన వ్యక్తి తిరుపతిలో సభ పెడితే 10లక్షల మందికి పైగా వచ్చారని పవన్‌ తెలిపారు. అఖండ ప్రజాదరణ ఉన్న వ్యక్తిని నిలబెట్టుకోలేకపోయామన్నారు. ఆయనే రాజకీయాల్లో ఉండి ఉంటే రాష్ట్రం బలమైన ముఖ్యమంత్రిని చూసేదన్నారు. అయినా ఆయనను కేంద్ర మంత్రిగా చూడగలిగామని తెలిపారు.

రజనీ విజయవంతం కావాలని కోరుకుంటున్నా..
‘రజనీకాంత్‌కు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో ఉంది. ఆయన పరోక్షంగా రాజకీయాలకు దగ్గరే ఉన్నారు. గతంలో డీఎంకేను గెలిపించాలన్నారు. బలమైన అభిమానులున్నప్పుడు రాజకీయాల్లోకి వస్తే మంచే జరుగుతుంది. ఆయన ఆశయం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని పవన్‌ పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

Last Updated : Dec 4, 2020, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details