ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా నేతలు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు' - women doctor issue in ap

అధికార పార్టీ నేతలపై ఓ ప్రభుత్వ వైద్యురాలి ఆరోపణలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఆసుపత్రిలో దిగువస్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు తనతో వైకాపా నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె అంటున్నారు. పోలీసులు కేసు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు చెప్పారు. న్యాయం కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలోని వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

'వైకాపా నేతలు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు'
'వైకాపా నేతలు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు'

By

Published : Jun 8, 2020, 10:27 AM IST

Updated : Jun 8, 2020, 1:17 PM IST

దళిత మహిళైన తనను వైకాపా నేతలు నిర్బంధించి వేధించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ప్రభుత్వ వైద్యురాలు ఆరోపించడం సంచలనంగా మారింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టించుకోలేదంటూ బాధితురాలు డాక్టర్‌ అనితారాణి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌కు జరిగిన తరహాలో తనకూ అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు.

నేను చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు (ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి నియోజకవర్గం)లోని పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలిగా డిసెంబరు నుంచి పని చేస్తున్నాను. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చినా వదులుకున్నాను. పెనుమూరు ఆసుపత్రిలో దిగువస్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు వారు నాపై కక్ష గట్టారు. మార్చి 22 (జనతా కర్ఫ్యూ రోజు)న నన్ను హాస్టల్‌ గదిలో నిర్బంధించి, స్థానిక వైకాపా నేతలను పిలిపించారు. వారంతా నన్ను రకరకాలుగా వేధించారు. దుర్భాషలాడారు. అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాత్‌రూమ్‌లోకి వెళ్లినా నన్ను ఫొటోలు, వీడియోలు తీశారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దారుణమైన వ్యాఖ్యలు చేసి మానసికంగా హింసించారు. జరిగిన పరిణామాలను పోలీసులకు వీడియోతో సహా ఫిర్యాదు చేశాను. వాళ్లు కేసు తీసుకోకుండా ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. కేసు పెట్టొద్దంటూ వైకాపా నేతలు బెదిరించారు. ఉన్నతాధికారులతో ఫోన్‌ చేయించి నాపై ఒత్తిడి తెచ్చారు - వైద్యురాలు అనితారాణి

తనను ఆదుకోవాలంటూ ఈ వివరాలన్నీ అనితారాణి... తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్‌ చేసి చెప్పడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేదు.. మహిళా కమిషన్‌ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని అనితారాణి వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో వారం కిందట హైకోర్టును ఆశ్రయించానని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి

జగన్ గారూ....దిశ చట్టం దిశ తప్పిందా?

Last Updated : Jun 8, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details