'విద్యార్థులు గడియారంలో సమయం చెప్పలేకపోతున్నారు' - educational tour
'ఎక్స్ప్లో ఎడ్యుకేషన్-2019' పేరుతో తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల యాత్రను లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తలపెట్టారు. చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీ పాఠశాల నుంచి దీనిని ప్రారంభించారు.
విద్య, వ్యవసాయం, స్థానిక ప్రభుత్వం, ఆరోగ్య రంగాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కొంతమంది ఛాంపియన్లను ఏర్పాటు చేస్తామని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, స్వచ్ఛందంగా పని చేసే వారిని నియమిస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా యాత్రను తలపెట్టిన ఆయన... చిత్తూరు జిల్లా మదనపల్లిలోని రిషీ వ్యాలీ పాఠశాల నుంచి గురువారం దీనిని ప్రారంభించారు. విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని... విద్యార్థులు గడియారంలో సమయాన్ని కూడా గుర్తించలేని విధంగా చదువులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి 80వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండటం లేదన్నారు. చిత్తూరు జిల్లాలోని రిషీ వ్యాలీ పాఠశాల తరహాలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తీసుకు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరగడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ మండలి ఏర్పాటుతో పాటు ప్రత్యేక అధికారాలు కల్పించాలన్నారు. గతంలో జిల్లా బడ్జెట్ ప్రవేశపెట్టేవారని... ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేనందున అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలుచేసి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సాయం అందించాలని కోరారు. అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని... దీన్ని తాను స్వాగతిస్తున్నట్లు జయప్రకాశ్ తెలిపారు.