కొవిడ్ విలయ తాండవమే లేకుంటే... రోజుకు లక్షమంది రాకపోకలు సాగించే నగరమిది. ఆపదమొక్కుల వాడిగా... కోనేటి రాయుడిగా భక్తుల కోరికలు తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వరున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, వారి శరణు ఘోష మాత్రమే ప్రతిబింబించాల్సిన పట్టణమది. అలాంటిది పగ.. ప్రతీకారేచ్ఛ, నేర ప్రవృత్తి పెరిగిపోయిన కొంత మంది కారణంగా ఆధ్యాత్మిక నగరి కీర్తి కరిగిపోతోంది. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాల్సిన తిరుపతిని.... ఎక్కడో సమస్యలు వెంటాడుతూ...వెనక్కి లాగేస్తున్నాయి. ప్రజలు జీవించేందుకు కావాల్సిన మౌలిక వసతులు, శాంతి భద్రతల కోణంలో జాతీయ స్థాయి జాబితాలో గతంలో రెండో స్థానంలో గెలిచిన తిరుపతి... నేడు ప్రమాణాల పరంగా ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది.
ముఠా కక్షలు..
ముఖ్యంగా ఇటీవలి కాలంలో లేనట్లుగా కొన్ని ముఠాలు పగప్రతీకారాలతో హత్యలకు పాల్పడటం నగరవాసుల్లో ఆందోళనను పెంచుతోంది. 2017లో జరిగిన సాకేత్ భార్గవ్ హత్యకి సమాధానంగా 2019లో రౌడ్ షీటర్ బెల్ట్ మురళీని ....భార్గవ్ మనుషులు హత్యచేశారు. ఆ తర్వాత 2019లో రౌడీషీటర్ బెల్ట్ మురళిని హత్య చేసిన వారిలో దినేష్ అనే యువకుడు ఉన్నాడు. కొన్ని రోజులు కిందట మురళీ ముఠా.....దినేష్ను అత్యంత పాశవికంగా హతమార్చారు. ఇది అన్ని చోట్ల ఉండేదే అయినా లింక్ హత్యలు జరగటం, ఆ పథకాలను పోలీసులు గుర్తించలేకపోవటం నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.
హ్యాకింగ్ గురైన పోలీసుల ఖాతాలు...
ఇంతే కాకుండా తిరుపతి అర్బన్ పోలీసుల పరిధిలోని శ్రీకాళహస్తి ఆలయంలో...అనధికార విగ్రహాల ఏర్పాటు విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. నిఘా వైఫల్యం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు పోలీసులు కేసు చేధనలో తెలిపారు. మనకు అనుక్షణం భద్రత ఇచ్చే పోలీసుల సామాజిక మాధ్యమాలే హ్యాకింగ్ గురైనట్లు వెలువడిన ప్రకటన....నగరంలో సైబర్ ఆటగాళ్ల మాఫియాను పరిచయం చేసింది. జరిగిన ఘటనపై కేసులు నమోదుకాగా....వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నారు. పోలీస్ ఆఫీసర్ల పేరిట నకిలీ సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరిచి....ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి రావటం మరింత ఆందోళను పెంచుతోంది.