ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆనందయ్య ఔషధం పంపిణీకి అనుమతులు ఇచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో ఆయన మాట్లాడారు. ఆనందయ్య ఔషధంపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులను తమ పార్టీ తరఫున స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఆనందయ్య కేవలం కోవిడ్ రోగులకే వైద్యం చేయట్లేదన్న నారాయణ.. గత 30 ఏళ్లుగా పరిసర ప్రాంత ప్రజలకు అనేక సమస్యలకు వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. కరోనా మందు అంటూ ఆనందయ్యను మానసికంగా క్షోభ పెట్టారని ఆరోపించారు. ఆనందయ్య ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.