శ్రీవారి సేవలో సీఎం జగన్.. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి తిరుమలలో నిర్మించిన నూతన బూందీ పోటుతో పాటూ.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ హిందీ, కన్నడ చానళ్లను.. ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి మఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి ఆశీస్సులతో.. చానళ్లు ప్రారంభించారు. శ్రీవారి ఆలయం ఎడమవైపున అధునాతన సాంకేతికతో నిర్మించిన బూందీ తయారీ పోటును ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో తితిదే చేపట్టిన నూతన కార్యక్రమాల గురించి....అధికారులు వివరించారు.
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో నిన్న పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం.. ఇవాళ మరోసారి శ్రీవారిని దర్శించుకుని.. ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకు ఆలయానికి చేరుకున్న సీఎం.. శ్రీవారి సన్నిధిలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం.. తులాభారం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా.. స్వామివారికి 78 కిలోల బియ్యం సమర్పించారు. తర్వాత.. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్ రెడ్డి.. తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. గో సంరక్షణ, శ్రీవారి గో ఆధారిత నైవేధ్యం, గుడికో గోమాత, అగరబత్తుల తయారీ, పంచగవ్య ఉత్పత్తులు, గో ఆధారిత వ్యవసాయంపై తితిదే చేపట్టిన కార్యక్రమాలను తితిదే ఈవో జవహార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తయారీ విధానాన్ని ఈవో తెలియజేశారు.
ఎస్వీబీసీలో ప్రసారం అవుతున్న ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాల వివరాలను అదనపు ఈవో ధర్మారెడ్డి వివరించారు. సహజ వ్యవసాయ పద్ధతులపై జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్‌కుమార్, తితిదే ఈవో జవహర్ రెడ్డి ఎంఓయు పత్రాలను మార్చుకున్నారు. అన్నమయ్య భవన్ వద్ద పుష్పాలతో తయారు చేసిన దేవతా కళా కృతులను సీఎం పరిశీలించి.. వీటిని తయారుచేసిన మహిళలను అభినంధించారు.
ఇదీ చదవండి: VIJAYAWADA: సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్