ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయాల కోసం దేవుణ్నీ వదలరా?: సీఎం

ప్రభుత్వం మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు దాని నుంచి దృష్టి మళ్లించడానికి దేవాలయాలను కూడా వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం బాధనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో, ఎవరూ లేని సమయంలో, చిన్న గుడిలోని దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

cm jagan fires on idol demolish incidents
cm jagan fires on idol demolish incidents

By

Published : Jan 4, 2021, 12:25 PM IST

Updated : Jan 5, 2021, 6:39 AM IST

రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్

రాజకీయపరంగా జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు అడ్డుకోవాలని సీఎం జగన్​ అన్నారు. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి తిరుపతిలో నిర్వహిస్తున్న ‘ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌’ను సీఎం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ చాలావరకూ ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి రావన్నారు. తెదేపా నాయకుల ఆధ్వర్యంలోని ఆలయాలు, జనసంచారం తక్కువగా ఉండే మారుమూల ప్రదేశాల్లో అర్ధరాత్రి జరిగిన ఘటనలవి అని పేర్కొన్నారు. ఆ తర్వాత వీటిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని, అనంతరం ప్రతిపక్షానికి చెందిన వారు అక్కడికెళ్లి రచ్చ చేస్తున్నారని, దాన్ని వారి అనుకూల మీడియాల్లో పెద్దగా చూపిస్తున్నారని విమర్శించారు.

దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి ప్రయోజనం? ప్రజా విశ్వాసాలను దెబ్బ తీసి, తప్పుడు ప్రచారం చేస్తే ఎవరికి లబ్ధి? ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలంతా ఆలోచించాలి... ప్రభుత్వ పథకాలకు ప్రచారం రావొద్దనే ఈ దాడులు.

- ముఖ్యమంత్రి

దేవుడంటే భయం, భక్తి లేని పరిస్థితుల్లో వ్యవస్థ
‘‘దేవుడంటే భయం, భక్తి లేని పరిస్థితుల్లోకి వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం దేవుడిని కూడా వదిలిపెట్టకుండా మేలు పొందాలనే దారుణమైన కలియుగం క్లైమాక్స్‌లో, అన్యాయమైన మనుషుల మధ్య ఉన్నాం. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతూ.. గుడులు, గోపురాలను ధ్వంసం చేసేందుకు వెనుకాడని వారిని ఏమనుకోవాలి? 18నెలల ప్రభుత్వ పాలన ప్రతిపక్షంలో భయాన్ని పుట్టించిందేమో!. ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలి. తమకు, పోలీసు శాఖకు చెడ్డపేరు తీసుకొచ్చే వారిని, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా దృష్టి మళ్లించే దుర్మార్గపు కార్యక్రమాలపై ఇగ్నైట్‌లో చర్చ జరగాలి. ఎన్నడూ లేని విధంగా దాదాపు 20వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎక్కడో మారుమూల, వారి అజమాయిషీలోని ఆలయాల్లో దాడులు జరుగుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ఒక పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతుంటే మన ఆలోచనలు కూడా మారాలి. ఇగ్నైట్‌లో దీన్ని కూడా చేర్చాలి. మతాలు, కులాలు మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలను చూస్తుంటే ఎలాంటి నేరాలను దర్యాప్తు చేయాల్సి వస్తుందనడానికి ఈ ఘటనలు ఓ ఉదాహరణ. నేరాలను తగ్గించడం, సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తమ విధానాలను తీసుకొచ్చే కార్యక్రమంగా ఇగ్నైట్‌ను మార్చుకోవాలి...’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఆ నేరాలను విచారించేలా ఆలోచన మారాలి
‘గతంలో దొంగతనాలు, దొంగల గురించి పోలీసు శాఖ విచారించేది. ఆ తర్వాత సైబర్‌ నేరాలొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఉన్నాం. వైట్‌కాలర్‌ నేరాలు పెరిగిపోయాయి. బహుశా దీన్నే కలియుగం అంటాం. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో గత ప్రభుత్వం... ఈ ప్రభుత్వం ఏ సంకేతాలిచ్చిందో బేరీజు వేసుకోవాలి. సొంత మనుషులు ఏం చేసినా చూసీచూడనట్లుగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఇప్పుడు మాత్రం అన్యాయం ఎవరు చేసినా వదిలేయవద్దనే సంకేతాలిచ్చాం...’’ అని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ‘‘గతేడాది మనబడి నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తే అది ప్రజల్లోకి వెళ్లకూడదని గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. మరోచోట ఆలయం నిర్మించి దేవుడిని ప్రతిష్టించాకే రోడ్డు విస్తరించినా గుడి కూల్చారంటూ ఆందోళన చేశారు...’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అలాగే రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, దిశ పోలీస్‌స్టేషన్‌, సంపూర్ణ పోషణ అభియాన్‌, వైఎస్‌ఆర్‌ ఆసరా, జల కళ, విద్యాకానుక ప్రారంభోత్సవం, ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా దేవాలయాల్లో చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తే కార్లపాడు గ్రామంలో వీరభద్రస్వామి గోపురం ధ్వంసం అంటూ ప్రచారం చేశారన్నారు. విజయనగరానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో సభాస్థలికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలోని ఆలయంలో రాముల వారి విగ్రహం ధ్వంసమైందని ఆయన చెప్పారు.

ప్రజా రక్షణలో పోలీసుల పాత్ర కీలకం: హోం మంత్రి సుచరిత
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని.. అటువంటి వారిని ఢీ కొనాలని హోంమంత్రి సుచరిత అన్నారు. తిరుపతిలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న పోలీస్‌ డ్యూటీ మీట్‌లో హోంమంత్రి వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. ‘ప్రజల ధన, ప్రాణ రక్షణలో పోలీసుల పాత్ర కీలకం. నేర స్వరూపం మారుతూ వస్తోంది. దీనికనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఏడాది కాలంలో వివిధ విభాగాల్లో పోలీసుల ప్రతిభ కారణంగా జాతీయ స్థాయిలో 108 అవార్డులు వచ్చాయి...’ అని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ పోలీసులు రాష్ట్రంలో హింస, దౌర్జన్యాలను అణచివేస్తూ శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఇదీ చదవండి:తిరుపతిలో 'పోలీస్ డ్యూటీమీట్' ప్రారంభం

Last Updated : Jan 5, 2021, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details