తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రంలోనే వైకాపా దారుణాలు చేసిందని.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆక్షేపించారు. ఈసీ కఠిన నిర్ణయం తీసుకుని ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు.
తిరుపతి ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని చంద్రబాబు అన్నారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని అన్నారు. వైకాపా నేతలు వందలమందిని తీసుకువచ్చి పర్యాటకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ఓటర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించామని.. అయితే.. దొంగ ఓటర్లను పట్టుకున్న వారిపైనే కేసులు పెట్టారని దుయ్యబట్టారు.
'కేంద్రం పంపిన బలగాలు ఏమయ్యాయి? వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైంది. అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. వైకాపా మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.'- తెదేపా అధినేత చంద్రబాబు
అన్ని సంఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని.. సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపించాల్సిందని చంద్రబాబు అన్నారు. చెక్‌పోస్టులను పోలీసులు ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు. భాజపా నాయకురాలు శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలని హితవు పలికారు. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్ అనే వ్యక్తి కోసం కాదని చంద్రబాబు అన్నారు.