అన్యమతస్థుల డిక్లరేషన్‌పై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తితిదేపై మరో ఆరోపణ తలెత్తింది. స్వామివారి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. కోట్ల మంది భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమకూర్చిన డబ్బును..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లలలో పెట్టుబడి పెట్టేందుకు తితిదే ప్రయత్నిస్తోందని భాజపా అధికార ప్రతినిధి, తితిదే ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు.
స్వామి సొమ్ము తరలించే ప్రయత్నం
స్వామి వారి సొమ్మును బాండ్ల రూపంలో ఇవ్వాలనుకోవటంపై భానుప్రకాశ్ అభ్యంతరం తెలిపారు. తిరుమల శ్రీవారికి సంబంధించి వివిధ జాతీయ బ్యాంకుల్లో దాదాపు 12 వేల కోట్ల రూపాయల నిధులున్నాయని.. వీటిలో మెచ్యూరిటీ అయిన ఫిక్స్డ్ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లలలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి తితిదే ఆర్థిక కమిటీ ఇప్పటికే అంగీకారం తెలిపిందని.. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని ఆయన చెప్పారు. బ్యాంకుల కంటే .. కాస్త వడ్డీ ఎక్కువ వస్తుందని ప్రభుత్వానికి ఇస్తామంటున్నారని.. తితిదే ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదని.. ఈ పరిస్థితిల్లో స్వామి సొమ్మును తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.