amaravati farmers sabha: న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే రైతులు, మహిళలు 44 రోజుల పాటు తుళ్లూరు నుంచి అలిపిరి వరకు పాదయాత్ర చేశారు. మహాపాదయాత్ర ముగింపుగా తిరుపతిలో 17వ తేదీన సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులను అనుమతి కోరగా వివిధ కారణాలను చూపుతూ నిరాకరించారు. చివరికి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సభ నిర్వహణకు అనుమతించడంతో అమరావతి పరిరక్షణ సమితి నేతలు సభ నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ సభ ద్వారా అమరావతి రాజధాని రైతుల త్యాగాలతోపాటు, అక్కడే రాజధాని ఎందుకు ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తుకు ఎలా దోహదపడుతుందనే అంశాలను వివరించనున్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు
అమరావతి మహోద్యమ పరిరక్షణ సభకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. బుధవారం రాత్రి న్యాయస్థానం ఆదేశాలు అందడంతో అప్పటికప్పుడు తిరుపతి పరిధిలోని దామినీడు వద్ద.. వాహనాలకే ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసి స్థలంలో ఉన్న ముళ్ల కంచెలను తొలగించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో బుధవారం ఉదయం.. శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఉదయం నుంచి జేసీబీలు, ప్రొక్లెయిన్ల ద్వారా సభ ప్రాంగణాన్ని మొత్తం చదును చేశారు. రోలర్ల ద్వారా మట్టిని చదును చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ మేరకు వేదికను సిద్ధం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు, వివిధ సంఘాల నేతలు, మహిళలు పాల్గొననున్న నేపథ్యంలో.. అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సభకు హాజరయ్యేవారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తిలకించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రానికి సభా ప్రాంగణాన్ని ఒక దిశకు తీసుకువచ్చారు..
హాజరుకానున్న ప్రముఖులు
అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన నేతలు సభకు వస్తున్నారు. భాజపా నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శులు అతుల్‌కుమార్ అంజన్, కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సబ్యులు హరినాథరెడ్డి, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన పార్టీ నుంచి పీఏసీ సభ్యులు హరిప్రసాద్, తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్, కాంగ్రెస్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ తదితరులు హాజరుకానున్నారు.