Dhavaleswaram flood: గోదావరిలో వరద మరింతగా పెరుగుతోంది. రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం 14.30 అడుగులకు చేరింది. సముద్రంలోకి 13.59 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద పోటుతో కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ప్రమాదకంగా ప్రవహిస్తున్నాయి. లంకలు ముంపు బారిన పడ్డాయి. జి.పెదపూడి లంక వద్ద కాజ్వే నీట మునిగింది. నడుం లోతు నీటిలో లంకవాసులు నడుచుకుంటూ ఒడ్డుకు చేరుతున్నారు.
కనకాయ లంక వద్ద నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కె. ఏనుగుపల్లిలంక కాజ్ వే మునిగిపోవడంతో లంక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలంలోనూ గౌతమీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎదురుబీడెం కాజ్ వే నీట మునిగింది. ముమ్మిడివరం, ఐ.పోలవరం కె.గంగవరం మండలాల్లో తీరం వెంబడి నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. యానాం తీరాన్ని వరద నీరు నీట ముంచేసింది. వశిష్ట గోదావరి తీరం మామిడికుదురు మండలంలోనూ లంకలు నీట మునిగాయి. భద్రాచలం నుంచి భారీగా వరద నీరు వస్తోంది. విలీన మండలాలు వరద ముంపులోనే మగ్గిపోతున్నాయి రహదారులు మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.