ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కళ్లెదుటే కొట్టుకుపోయిన ధాన్యం.. కర్షకుల కన్నీరు - రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం... రైతులను తీవ్ర వేదనకు గురిచేసింది. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తడిసిముద్దయ్యాయి. కళ్లెదుటే ధాన్యం నీళ్లలో కొట్టుకుపోవడంతో కర్షకులు కన్నీటిపర్యంతమయ్యారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

కళ్లెదుటే కొట్టుకుపోయిన ధాన్యం.. కర్షకుల కన్నీరు
కళ్లెదుటే కొట్టుకుపోయిన ధాన్యం.. కర్షకుల కన్నీరు

By

Published : Apr 25, 2020, 1:24 PM IST

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షార్పణమవ్వగా... మరికొన్ని చోట్ల నీళ్లలో కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, పోచంపల్లి మండలాల్లో వడగళ్ల వాన కురవగా... వలిగొండ, బీబీనగర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్థానిక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం..

ఆలేరు నియోజకవర్గంలో వడగళ్ల వర్షం కురిసింది. మోటకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఓ ఇంటి రేకులు ధ్వంసమయ్యాయి. ఆలేరు మండలంలోని మదనపల్లి, సాయిరెడ్డిగూడెం, రాజాపేట, తుర్కపల్లి, కొల్లూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది.

మునిగడపలో పిడుగుపాటుతో..

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపలో పిడుగుపాటుతో 15ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గజ్వేల్‌, జగదేవపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వానలకు.. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం నీళ్లలో తడిసిపోయింది. ఈదురుగాలులుతో నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. అక్కెనపల్లిలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్ర రాజధానిలో..

రాష్ట్ర రాజధానిలోనూ జోరువాన కురిసింది. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మల్కాజిగిరి, నేరెడీమేట్, కుషాయిగూడ, చర్లపల్లి, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడలో.... ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:భారీగా తగ్గిన పాల అమ్మకాలు: నష్టపోతున్న పాడిరైతు

ABOUT THE AUTHOR

...view details