FIRST ALERT AT DHAVALESWARAM : ఎగువన భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి వెళ్తోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విలీన, లంక గ్రామాల ప్రజలు మళ్లీ వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మళ్లీ గోదావరి వరద అలజడి మొదలైంది. ఈ సీజన్‌లో మూడోసారి గోదావరికి వరద రావడంతో.. తీర ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద అంతకంతకూ పెరుగుతోంది. విలీన మండలాలు మరోసారి ముంపు బారిన పడ్డాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు భయపడి ఇప్పటికే చాలా మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తుండగా.. మిగిలిన వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
రాజమహేంద్రవరానికి వరద పోటెత్తుతోంది. అఖండ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్టకు భారీగా నీరు చేరుతోంది. పెద్దఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.