తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. జిల్లాలోని రంపచోడవరం, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం, కోనసీమలోని అమలాపురం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, కోనసీమ ముఖద్వారమైన గోపాలపురం తదితర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాపార కార్యకలాపాలు, దుకాణాలు బంద్ చేయించారు. కరోనా పై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కర్ఫ్యూ వేళల్లో అత్యవసరల పనులంటూ బయట తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
పశ్చిమ గోదావరి నుంచి గోపాలపురం మీదుగా కోనసీమలోకి ప్రవేశించే వాహనాలను అధికారులు నిలిపివేశారు. జాతీయ రహదారి 216 పై ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపి.. వారి ప్రయాణ వివరాలు సేకరించాకే వాటిని ముందుకు వెళ్లేలా స్థానిక పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అత్యవసరమైన మందుల దుకాణాలు తప్ప మిగిలిన వాటిని పోలీసులు నిర్ణీత కర్ఫ్యూ సమయానికి మూసివేయిస్తున్నారు. అనవసరంగా బయటకు రావద్దంటూ మైక్‌లలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడంతో బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఈ సమయంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.