'దిశ' చట్టం అనేది చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజమహేంద్రవరంలో దిశ పోలీస్స్టేషన్ ప్రారంభించారు. నేరాలు ఎవరు చేసినా ప్రయోగిస్తామని చెప్పడానికే 'దిశ' తెచ్చామని తెలిపారు. 'దిశ' బిల్లు అనేది దేశంలోనే ప్రత్యేకమైందన్నారు. మనుషులు రాక్షసులు అవుతున్న ఘటనలు చూస్తున్నామని.. అలాంటివారికి వెంటనే శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే మారతారని సీఎం అన్నారు. అప్పుడే అఘాయిత్యాలను ఆపగలుగుతామన్నారు. నిర్భయ ఘటన జరిగి 8 ఏళ్లైనా నిందితులకు శిక్ష అమలు చేయలేదన్నారు. మార్పు రావాలన్న ఆలోచనతోనే 'దిశ' చట్టం తీసుకొచ్చామని వెల్లడించారు.
మార్పు రావాలన్న ఆలోచనతోనే 'దిశ' : సీఎం జగన్ - రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటన
తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే నిందితులు భయపడతారని.. అప్పుడే అఘాయిత్యాలు ఆగుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నేరాలు ఎవరు చేసినా శిక్షించేందుకు 'దిశ' చట్టం తెచ్చామని ఉద్ఘాటించారు.
21 రోజుల్లోనే శిక్ష...
చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగితే 7 రోజుల్లోపే దర్యాప్తు చేసి.. 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడేలా 'దిశ'లో రూపొందించామని వివరించారు. ఈ చట్టం అనుమతి కోసం కేంద్రానికి పంపించామని తెలిపారు. ఈ నెలాఖరులోగా 18 పోలీసుస్టేషన్లు ఏర్పాటవుతాయని.. 'దిశ' పోలీసుస్టేషన్‌లో 36 నుంచి 40 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఎస్‌వోఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 5,048 మొబైల్ ఫోన్లకు ఎస్‌వోఎస్ యాప్ అనుసంధానమై ఉంటుందన్నారు.
ఇవీ చదవండి.. మహిళల మరింత భద్రతకై 'దిశ' యాప్ ఆవిష్కరణ