శేఖర్ రెడ్డి మరో ఇద్దరు బినామీలకు జగన్ సర్కారు ఇసుక కాంట్రాక్టులు ధారాదత్తం చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ట్రక్కు ఇసుక రూ.8 వేలకు కూడా దొరకడం లేదని ఆయన దుయ్యబట్టారు. భవననిర్మాణ కార్మికులు జీవనోపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా జగన్ లెక్కచేయట్లేదని మండిపడ్డారు. బస్తాలకొద్దీ డబ్బు కోసం ప్రజలు ఏమైపోయినా పట్టించుకోవట్లేదని విమర్శించారు.
"పేదల ఆరోగ్యమన్నా లెక్కలేదు. మీ సొంత బ్రాండ్ నాసిరకం మద్యం అమ్మకాల కోసం పేదల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. కమీషన్ల కక్కుర్తి కోసమే ధరలు విపరీతంగా పెంచేశారు. ఇదే విషయం బహిర్గతం చేసిన ఓం ప్రతాప్‌ను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు."
---చంద్రబాబు, తెదేపా అధినేత
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలతో మాట్లాడిన చంద్రబాబు...వైకాపా ప్రజలకు గోరంత ఇస్తూ కొండంత దోచుకుంటుందని ఆరోపించారు. అమరావతి, పోలవరం, ప్రత్యేకహోదా మూడు అంశాల్లోనూ జగన్ ప్రజల్ని మోసగించారన్నారు. భావితరాలకు బహుమతిగా పోలవరాన్ని, అమరావతిని అందించాలని తెదేపా ప్రభుత్వం ఆరాటపడిందన్న చంద్రబాబు.. ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా లేదు కానీ అక్కడ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ ఇవ్వని వైకాపా సర్కారు.. విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారన్నారు. పొట్టి శ్రీరాములు, బెజవాడ గోపాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి హేమాహేమీల పుట్టిన నెల్లూరులో వైకాపా నేతలు విచ్చలవిడి దందాలు, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చంద్రబాబు అక్షేపించారు.
రాజధానిని నెల్లూరుకు దూరం చేస్తున్నారు
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చటం వల్ల నెల్లూరుకు ఎంతో దూరం అవుతుందని, దాంతో వ్యయ ప్రయాస భారమవుతుందని చంద్రబాబు అన్నారు. అమరావతి పేరు విన్నా, భూములిచ్చిన రైతులన్నా జగన్‌కు గిట్టడంలేదన్నారు. నెల్లూరులో తెదేపా చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ వైకాపా నిలిపివేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోనే పరిశ్రమలు నెలకొల్పి పిల్లలకు కల్పించిన ఉపాధి అవకాశాలన్నింటినీ పోగొట్టిందన్నారు. నాణ్యమైన ధాన్యం పండించే నెల్లూరు రైతులకు మద్దతు ధరలేక రూ.750 కోట్లు నష్టపోయారని తెలిపారు. జగనన్న పుట్టీకి 1150 కిలోలని మంత్రులే చెప్పటం రైతుల్ని దగా చేయటమేనని ఆక్షేపించారు. పుట్టీకి 300 కిలోల ధాన్యంతో పాటు ధరలో రూ.8 వేలు చొప్పున రెండు విధాలా రైతులకు నష్టం చేకూర్చారని ఆరోపించారు. పండించిన పంటలను రోడ్లపై పోసి తగులపెట్టే దుస్థితి రైతుల్లో దైన్యానికి అద్దం పడుతోందన్న చంద్రబాబు.. రైతులు, భవన నిర్మాణ కార్మికులను దారుణంగా దెబ్బతీసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు.