ఆస్తి కోసం..
ఆస్తి తగాదాలు... నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం దీబగుంట్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగ శేషుడికి.. తన పెదనాన్న కొడుకైన ఆంజనేయులుతో కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆస్తి విషయంలో గత కొన్నిరోజులుగా తరుచూ గొడవ పడేవారు. మరోసారి తగాదా చోటుచేసుకోవడంతో.. ఆగ్రహించిన ఆంజనేయులు.. నాగశేషుడిని గొడ్డలితో నరికాడు. తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, అతడి భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు లారీలు ఢీ... ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు బస్టాప్ వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు బస్టాప్ వద్ద తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి చెన్నైకి ఐరన్ కడ్డీల లోడ్‌తో వెళ్తున్న లారీ... ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఐరన్ లోడ్‌లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో డ్రైవర్ కర్ణాటకకు గదగ్ జిల్లాకు చెందిన ఉలిగప్పగా గుర్తించారు. క్లినర్ వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా మేడి కొండూరులో చోటుచేసుకుంది. మేడి కొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌కు గుంటూరు నగరానికి చెందిన శివరంజనీతో 15 వేళ్ల క్రితం వివాహమైంది. దుర్గా ప్రసాద్ టింబర్ డిపో వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందని అప్పులు తీర్చాలని... అధిక కట్నం కావాలని శివరంజనిపై ఒత్తిడి చేసేవాడు. ఈ దంపతుల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చేవి.
ఈ క్రమంలో భర్త వేధింపులతో మనస్తాపానికి గురై ఫిబ్రవరి 26న శివరంజనీ ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 2న మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చంద్రకళ(28) అనే వివాహిత అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి భర్త తిమ్మప్ప దిన కూలితో జీవనం సాగిస్తున్నాడు. వడ్డీ వ్యాపారుల నుంచి సమారు రూ.7 లక్షలకు పైగా రూ.10 అధిక వడ్డీ కింది వేరొకరికి హామీగా ఉండి... చంద్రకళ అప్పులు ఇప్పించింది. సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో... వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు తెలిపారు. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథులుగా మారరని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.