ఎన్నో ఆశలతో రైతన్నలు ఉల్లిని సాగు చేశారు. ఈ ఏడాదైనా మంచి ధరలు వస్తాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు 17వేల 392 హెక్టార్లు కాగా.. ఈ ఖరీఫ్‌లో 15 వేల 373 హెక్టార్లలో ఉల్లి పంట సాగు చేశారు. ఒక ఎకరా పొలంలో ఉల్లిని సాగు చేయటానికి రూ. 75,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దిగుబడులు సరాసరి 50 క్వింటాళ్ల వరకు వస్తున్నాయి. గతంలో ఈ సమయానికి ఉల్లి దిగుబడులతో మార్కెట్ కిటకిటలాడేది. ఈ ఏడాది ఈ- నామ్ ప్రవేశపెట్టడంతో కొనుగోళ్లు నిలిచి.. ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు తిరిగి ప్రారంభించాలంటూ వ్యవసాయ మార్కెట్ కార్మికసంఘాలు ఆందోళన చేపట్టాయి.
మొదట్లో ఉల్లి కొనుగోళ్లను బహిరంగ వేలం ద్వారా వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఉల్లిని ఆన్ లైన్ మార్కెట్ విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లతో అధికారులు పలు దఫాలుగా చర్చించారు. ఎట్టకేలకు వ్యాపారులు కొత్త విధానానికి అంగీకరించటంతో ఈ ఏడాది ఆగస్టు 17న ఈ- నామ్ విధానం ద్వారా ఉల్లి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ-నామ్ విధానంతో నష్టాలు వస్తున్నాయన్న కారణంతో ఉల్లి కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకురాకపోవటంతో సెప్టెంబర్ 17న కొనుగోళ్లు నిలిచిపోయాయి. అప్పటి నుంచి అధికారులు వ్యాపారులతో చర్చలు జరుపుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు.-విజయలక్ష్మి, మార్కెట్ యార్డు కార్యదర్శి
విపణిలో కొనుగోళ్లు నిలిచిపోవటంతో రైతులు కోయంబేడు, హైదరాబాద్, చెన్నై, తాడేపల్లిగూడెం, గుంటూరు మార్కెట్లకు వెళ్లి.. వ్యాపారులకు తక్కువ ధరలకే ఉల్లిని విక్రయిస్తున్నారు. క్వింటా ఉల్లి కేవలం 500 నుంచి 11వందల వరకు పలుకుతోంది. దీని వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడులకు అదనంగా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.