రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి కాకినాడ జీజీహెచ్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పంచనామా పూర్తికాలేదు. తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
13:31 May 21
వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్
Tension at kakinada GGH: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ను అరెస్టు చేసేవరకూ శవపరీక్ష కోసం సంతకం చేయమని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు తేల్చిచెబుతున్నారు. దీంతో సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పంచనామా పూర్తికాలేదు. పోస్టుమార్టం చేసే పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పలు పార్టీల నాయకులు, దళిత, ప్రజా సంఘాల వాళ్లు తరలివస్తున్నారు. దీంతో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత, ప్రజా సంఘాల నాయకులు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టారు. వైకాపా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటూ నినదించారు.
బాధిత కుటుంబానికి ప్రముఖ న్యాయవాది శ్రావణ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. వైకాపా ఎమ్మెల్సీని అరెస్టు చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. పోలీసుల తీరును తప్పుబట్టిన దళిత, ప్రజా సంఘాల నేతలు.. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనన్నారు. తన అన్నను అన్యాయంగా చంపేశారన్న మృతుడి సోదరుడు.. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ను అరెస్టు చేసేవరకూ శవపంచనామా జరగనీయం అన్నారు. దీంతో కాకినాడ జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఇవీ చదవండి: