ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. దేవిక బంధువుల డిమాండ్​ - కాకినాడ తాజా వార్తలు

Postmortem to Devika dead body: కాకినాడ జిల్లాలో ఉన్మాది చేతిలో బలైపోయిన యువతి దేవిక మృతదేహానికి శవపరీక్ష పూర్తయింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవిక కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి.. నిందితుడికి త్వరగా శిక్షపడాలని అధికారులను ఆదేశించారు. ఉత్తుత్తి ప్రకటనలు మానేసి.. నిందితుడికి వెంటనే శిక్షపడేలా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Devika
దేవిక మృతదేహానికి పోస్టుమార్టం

By

Published : Oct 9, 2022, 6:03 PM IST

దేవిక మృతదేహానికి పోస్టుమార్టం

Postmortem to Devika dead body: ప్రేమకు నిరాకరించదనే కారణంతో.. కాకినాడ జిల్లాలో శనివారం ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన దేవిక మృతదేహానికి.. జీజీహెచ్‌లో శవపరీక్ష పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమార్తె మృతదేహాన్నిచూసి ఆమె తల్లి, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదంటూ రోదించారు. నిందితుడు సూర్యనారాయణను కఠినంగా శిక్షించాలని దేవిక తల్లి, బంధువులు డిమాండ్ చేశారు.

కాకినాడ జిల్లా పెదపూడి మండలం కూరాడకు చెందిన దేవికను.. ఏడాది కాలంగా ప్రేమ పేరుతో దేవికను వేధిస్తున్న నిందితుడు వెంకట సూర్యనారాయణ.. శనివారం దారికాచి ఆమెపై దాడి చేశాడు. కత్తితో మెడపై విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్యచేశాడు. నడిరోడ్డుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన దేవిక.. అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణాలు వదిలింది. నిందితుడు వెంకటసూర్యనారాయణను పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు... అతడ్ని పోలీసులకు అప్పగించారు.

యువతి హత్య ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి... ఆమె కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దేవిక కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలవాలని.. అధికారులను ఆదేశించారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పోలీసులకు నిర్దేశించారు. త్వరగా కేసు విచారణ పూర్తి చేసి.. ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని సూచించారు.

దేవిక హత్య కేసులో ఓ రూపమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం ప్రకటనలు చేయడం.. మోసగించడమేనని.. తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటనలే పరిమితం అవుతోందని విమర్శించారు. ఉత్తుత్తి ప్రకటనలు మాని.., నిందితులకు తక్షణం శిక్షపడేలా చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే నేరస్థులకు భయం... మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు. కొత్త చట్టాలు కాదు.., కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసు పెట్టిన వివాహిత ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న చంద్రబాబు.. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వ అలసత్వానికి ఇదే నిదర్శనమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details