'అట్రాసిటీ చట్టం అమలు చేయకుంటే అధికారులపై చర్యలు' - attacks on dalits
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీలపై దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు హెచ్చరించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సింగంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. మామిడికాయలు కోశాడన్న నెపంతో దళిత యువకుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి కలెక్టర్ కార్యాలయంలో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితులకు అంత త్వరగా బెయిలు ఎలా వచ్చిందని అమలాపురం డీఎస్పీని ప్రశ్నించారు. వెంటనే హైకోర్టులో పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేయించి విచారణ జరిపించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి చట్టం ప్రకారం రావాల్సిన సాయం వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. కేశనపూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారంపై అధికారులను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ భాజపాయ్ తో సహా ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అధికారులపై అనుమానాలు
కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అనంతరం మీడియాతో రాములు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలయినా ఇప్పటికీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 18గ్రామాల ప్రజలకు ఓటు హక్కు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం ఇలా ఎన్నో చోట్ల బలమైన కేసులున్నా న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. ఈ అంశంలో కలెక్టర్లు, ఎస్పీలపై అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. చట్టసభలున్నా, కఠినమైన చట్టాలున్నా ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగట్లేదని అన్నారు. పోలీసులు, అధికారులు చిత్తశుద్ధితో చట్టాలు అమలు చేస్తేనే మేలు జరుతుందని రాములు అన్నారు.