ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నా చిన్ననాటి కల.. ఇప్పుడు నెరవేరింది: ఉపరాష్ట్రపతి - velugonda

దేశంలోనే అతి పొడవైన, విద్యుద్దీకరించిన సొరంగమార్గాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. చెర్లోపల్లి- రాపూరు రైల్వేస్టేషన్ల మధ్య గుర్రపునాడ ఆకారంలో నిర్మించిన ఈ సొరంగం ఓ ఇంజనీరింగ్‌ అద్భుతమని ఆయన కితాబిచ్చారు.

ఉపరాష్ట్రపతి

By

Published : Aug 31, 2019, 5:09 PM IST

Updated : Aug 31, 2019, 7:54 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తన చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తమ పూర్వీకులు, తాను పుట్టి పెరిగిన ఊరికి దగ్గరగా రైల్వే లైను వెళ్లడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ నెల్లూరుకు వచ్చారు. అక్కడినుంచి ప్రత్యేక రైలులో వెళ్లి కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వేమార్గాన్ని పరిశీలించారు. రూ.1,993 కోట్లతో 93 కి.మీ ఈ భారీ రైలు మార్గాన్ని దక్షిణమధ్య రైల్వే ఇటీవల నిర్మించింది. చెర్లోపల్లి- రాపూరు రైల్వేస్టేషన్ల మధ్య నిర్మించిన 7.6 కిలోమీటర్ల సొరంగమార్గాన్ని ఉపరాష్ట్రపతి జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

కల నెరవేరిన వేళ..
"దేశంలోనే అతి పొడవైన, విద్యుదీకరించిన సొరంగమార్గాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. చెర్లోపల్లి- రాపూరు రైల్వేస్టేషన్ల మధ్య గుర్రపునాడ ఆకారంలో నిర్మించిన ఈ సొరంగం ఓ ఇంజనీరింగ్‌ అద్భుతం. ఆధునిక నిర్మాణ నైపుణ్యానికి మచ్చుతునక. కృష్ణపట్నాన్ని మిగతా ప్రాంతాలతో కలిపేందుకు ఈ రైల్వే లైను వారధిలా ఉపయోగపడుతుంది. నిజానికి ఓబులవారి పల్లె - కృష్ణపట్నం రైల్వేలైను నా చిన్ననాటి కల. మా పూర్వీకులు, నేను పుట్టి పెరిగిన ఊరికి దగ్గరగా ఈ రైల్వేలైను వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవడంతో నా చిరకాల వాంఛ నెరవేరినట్లయింది. రాపూరు కొండల ద్వారా రైలు మార్గం వెళుతుందని ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించలేదు. ఇది పూర్తవ్వడానికి ఎంతో కృషి చేశాను" అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

అదే ప్రత్యేకత..
"ఈ రైల్వే లైను మొత్తంగా 112 కిలోమీటర్ల పొడవును 1,993 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మార్గంలో 9 స్టేషన్లు, 146 బ్రిడ్జిలు, 2 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఒక్క లెవల్ క్రాసింగ్‌ కూడా లేకపోవడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, కృష్ణపట్నం పోర్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాగర్ మాలా డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్‌ఎండీసీ సంస్థలు ఈ ప్రాజెక్టును 43నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినందుకు అధికారులు, ఇంజనీర్లు, ఎలక్ట్రీషియన్లు అందరికీ అభినందనలు" అని వెంకయ్యనాయుడు అన్నారు.

Last Updated : Aug 31, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details