సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఓ పక్క వలసలు కొనసాగుతుంటే...మరొపక్క అధికార తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహాలకు తెరతీసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వారికి ఓ మార్గం నిర్దేశించింది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసి నేరుగా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించింది. ఇప్పటికే టికెట్లు ఖరారైన మంత్రి సోమిరెడ్డి, విప్ రామసుబ్బారెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
మంత్రులు నారా లోకేశ్, నారాయణ, మరికొందరు నేతలు ఇదే బాటలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవుల్లో కొనసాగుతూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం సబబు కాదని అధిష్టానం తలుస్తోంది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే నేతలకే టికెట్లు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. టికెట్టు ఆశించి భంగపడిన వారికి ఎమ్మెల్సీ పదవులు వరించనున్నాయి. కడప కడప జిల్లా జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డిని పోటీకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేయనున్నారు. రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కేటాయించే అవకాశం ఉంది. రామసుబ్బారెడ్డి, తెదేపా నేత నెల్లూరు తాజా రాజీనామాలతో నెల్లూరు రాజకీయం ఓ కొలిక్కొచ్చేలా ఉంది.
అధిష్టానం ఆదేశాలతో మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవికి మేయర్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీటు గవర్నర్ కోటలో ఎన్నికైనది కాబట్టి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేకుండా, సీఎం..గవర్నర్కు ఎవరి పేరైనా సూచించవచ్చు.సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు నుంచే మరో మంత్రి నారాయణ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుంది.
ఆలోగా నారాయణ రాజీనామా చేయాలా, వద్దా అనే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నుంచి నారాయణను పోటీకి దించాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో స్వల్ప వ్యవధిలో పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగింపు ఉండదని స్పష్టమయ్యింది. ఈ స్థానాన్ని వేరొకరికి కేటాయించనున్నారు. యువ నేత నారా లోకేశ్ ఈ సారి ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టం రాలేదు. ఉత్తరాంధ్ర, అమరావతి ఈ రెండింటిల్లో ఎక్కడి నుంచైనా లోకేశ్ పోటీ చేయవచ్చు.