GANDIKOTA CANAL WORKS: కడప జిల్లాలో గండికోట జలాశయం నుంచి 56 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కాలువను మరింత వెడల్పు చేయడానికి రూ.323 కోట్లు అవసరమని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు నివేదించారు. పనుల అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 1న ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.305.70 కోట్లకు పరిపాలనామోదం ఇచ్చింది. ఇంజినీరింగ్ అధికారులు రెండు ప్యాకేజీలుగా విభజన చేశారు. కరవు సీమకు గుండెకాయ లాంటి గండికోట నుంచి 0-36.640/34.092 కిలోమీటరు వరకు రూ.170 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 నిర్మాణ ధరలను (ఎస్‌ఎస్‌ఆర్) అనుసరించి సుమారు రూ.157.41 కోట్ల విలువ చేసే పనులు అప్పగించడానికి 2021, నవంబరులో గుత్తపత్రాలు ఆహ్వానించారు. రెండు గుత్తేదారు సంస్థలు పోటీపడ్డాయి. గుత్తపత్రాలను గతేడాది డిసెంబరులో తెరిచారు. రివర్స్ టెండర్ల విధానం అనుసరించడంతో రూ.7,08,37,533 ఆదా అయింది. ఓ గుత్తేదారు సంస్థ రూ.151,14,42,459 (-0.5368 శాతం) నమోదు చేసింది. అతి తక్కువ విలువకే చేసేందుకు ముందుకు రావడంతో రూ.150,33,29,788తో పనులు చేసే బాధ్యతను ఆ సంస్థకే ఇంజినీర్లు అప్పగించారు. పనులు చేయాలని నెల కిందట ఒప్పందం జరిగింది. మూడేళ్ల పాటు గడువిచ్చారు.
32.640/34.092 కిలోమీటర్ల నుంచి 56 కిలోమీటర్ల వరకు కాలువ విస్తరణకు రూ.130 కోట్లు కావాలని ఇంజినీర్లు అంచనా వేశారు. ఇందులో రూ.118,10,96,655.75 విలువ చేసే పనులకు రివర్స్ టెండర్లు పిలిచారు. ఓ గుత్తేదారు 113,40,34,235కే చేసేందుకు ముందుకొచ్చారు. అంటే ప్రభుత్వానికి రూ.4,72,43,864 నిధులు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గుత్తేదారు 0.016 శాతం తక్కువకు నమోదు చేయడంతో రూ.113,38,52,791.75కే చేసేవిధంగా ఒప్పందం జరిగింది. విస్తరణ, ఆధునికీకరణ పనులు చేయడానికి మూడేళ్లు గడువు ఇచ్చినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.
ఈ రెండు ప్యాకేజీల అంచనా విలువ రూ.275.52 కోట్లు కాగా, రివర్స్ టెండర్లతో రూ.11.80 కోట్లు మిగిలింది. గుత్తేదారులు రూ.264.54 కోట్లతో చేస్తామని పనులు దక్కించుకోగా నిర్దేశిత అంచనా విలువతో అతి తక్కువ లెస్‌తో నమోదు చేసి రూ.263.71 కోట్లతో చేసేందుకు అంగీకరించారు. లెస్‌కు వేయడంతో రూ.82.94 లక్షల భారం తప్పింది.
నష్టాన్ని తగ్గించేందుకు..
కడప శ్రీకృష్ణదేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో(జీఎన్‌ఎస్‌ఎస్) భాగంగా గండికోట జలాశయం నుంచి కాలువను విస్తరించాలని 10 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం జల స్ఫూర్తితో సంకల్పించింది. ఇప్పటి కంటే కృష్ణా జలాల ప్రవాహ వేగంతోపాటు మరింత సామర్థ్యం పెంచాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కరవు సీమలో నీటి నడకలతో జరిగే నష్టాన్ని తగ్గించేందుకు సిమెంటు కాంక్రీటు పూత వేయాలని అనుమతులిచ్చారు. బృహత్తర జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకాలను అనుసంధానం చేయాలని పాలకులు పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో మునుపటి కంటే మరింత వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టారు.
కరవు సీమకు కృష్ణవేణి...