ఉమ్మడి గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం యలవర్రులో సాధారణ రైతు కుటుంబంలో, 1922 సెప్టెంబర్ 10న యలవర్తి నాయుడమ్మ జన్మించారు. రాఘవమ్మ, అంజయ్య దంపతులకు జన్మించిన నాయుడమ్మ.. అదే గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. తురుమెళ్ల పాఠశాలలో పదో తరగతి పూర్తిచేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్ చదివిన నాయుడమ్మ... బీఎస్సీ కెమికల్ టెక్నాలజీ కోర్సును బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. తర్వాత మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ కళాశాలలో చేరారు. ఇది పూర్తయ్యాక.. ఆయన మేథాశక్తిని గుర్తించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం.. లెదర్ టెక్నాలజీలో ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనల కోసం 1946లో ఆయన్ని బ్రిటన్ పంపించింది. అక్కడే ఆయన లెదర్ టెక్నాలజీలో ప్రత్యేక అధ్యయనాలు పూర్తిచేసి అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయంలో చర్మశుద్ధిపై మాస్ట్‌ర్ డిగ్రీ పొందారు.
మద్రాస్‌లోని సెంట్రల్ లెదర్ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు
చర్మశాస్త్రంలో చేసిన పరిశోధనల కారణంగా నాయుడమ్మకు విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ.. స్వదేశంపై మక్కువతో మాతృదేశానికి తిరిగి వచ్చేశారు. 1951లో మద్రాస్‌లోని సెంట్రల్ లెదర్ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా చేరారు. చర్మకారులు, చర్మ పరిశ్రమలకు మేలు చేసేలా ప్రణాళికలు రూపొందించి అమలుపర్చారు. అనతి కాలంలోనే మద్రాస్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థగా తీర్చిదిద్దారు. అదే సంస్థలకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత సి.ఎస్.ఐ.ఆర్ డైరక్టర్ జనరల్‌గా పని చేశారు. 1971 నుంచి 1977 వరకు భారత కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విషయాల శాఖ కార్యదర్శి, భారత విజ్ఞానశాస్త్ర పరిశోధన మండలి డైరెక్టరు పదవులను ఏకకాలంలో నిర్వహించారు.
నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్
తోళ్ల పరిశ్రమ అంటేనే అసహ్యించుకునే పరిస్థితుల్లో తన పరిశోధనల ద్వారా ఆ రంగాన్ని చాలామందికి ఉపయోగపడేలా చేశారు నాయుడమ్మ. చైన్నైలోని చర్మపరిశ్రమలు వ్యర్థాల సమస్యతో మూతపడే స్థాయికి రావడంతో దీనిపై ప్రయోగాలు జరిపి వ్యర్థాల అనర్థాలను రూపుమాపారు. తోలు పరిశ్రమలపై ఆధారపడిన ఎందరో కార్మికులకు ఉపాధిని పదిలం చేశారు. ప్రస్తుతం సుమారు 25 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన శాష్ట్రవేత్తలకు ఏటా తెనాలిలో నాయుడమ్మ పేరిట పురస్కారాన్ని నాయుడమ్మ ట్రస్ట్ ప్రధానం చేస్తోంది.