గ్రామీణ ప్రాంతాల్లో సగటున లక్ష మందికి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో 11చోట్ల ప్రతి లక్షకి పదికిపైగా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక పరిధిలో 33,732 జనాభా ఉంటే లక్షకు 29.65 కేసులు నమోదయ్యాయి. ఇదే జిల్లా వాకాడు మండలంలో 35,385 జనాభా ఉంటే లక్షకు 19.85 కేసులు వచ్చాయి. ఇలాగే ప్రతీ లక్ష జనాభాకు కడప జిల్లా బద్వేలులో 19.78, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో 16.56, తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో 13.35, కర్నూలు జిల్లా పాణ్యంలో 11.12 వంతున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గుంటూరు నగరం-97, కర్నూలు-68, విజయవాడ-52, నెల్లూరు-33, ఒంగోలులో 27 వంతున కేసులు వచ్చాయి. వైరస్ ప్రైమరీ నుంచి సెకండరీ కాంటాక్టుల వరకూ కూడా సోకడంతో ఒకే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
* రాష్ట్రం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో.. గరిష్ఠంగా గుంటూరులో 16.64% కేసులు నమోదయ్యాయి. జనాభా ప్రతి లక్షకు 15.65 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నగరంలోని ఆనందపేటలో 35, కుమ్మరిబజారులో 30, సంగడిగుంటలో 10 కేసులు వచ్చాయి.
* కర్నూలులో 68 కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఇవి 11.5%. నగరంలోని ప్రతి లక్ష జనాభాకు 14.65 చొప్పున కేసులు వచ్చాయి. కర్నూలు పాత నగరం, దీనికి అనుకుని ఉన్న ఎన్నార్‌పేట, ప్రకాశ్‌నగర్, గనిగల్లి, ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.