మీడియా సమావేశంలో వర్ల రామయ్య ఎన్నికల కమిషన్ పారదర్శకత కోల్పోయిందని, జవాబుదారీతనం కనుమరుగైందని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద మీడియాతో ఆయన ఈసీ తీరుపై మండిపడ్డారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లో ఒకరైన అశోక్ లావాసా తన అభిప్రాయాన్ని ప్రధాన ఎన్నికల అధికారి అరోరా పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల సంఘంలోనూ చిచ్చు పెట్టిన ఘనత మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మత విద్వేష ప్రసంగాలపై ఈసీ చర్యలు ఎందుకోలేదని ప్రశ్నించారు. కేదార్‌నాథ్, ధ్యాన్ కుటియా గుహలో ప్రధాని ధ్యానం చేస్తూ వ్యవహరించిన తీరు ఓ మతానికి చెందిన ఓటర్లను ఆకర్షించేలా ఉందని దీనిపై ఈసీ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. సుమోటాగా ప్రధానిపై కేసు నమోదు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ తీరు సరిగా లేదని ఎన్నోసార్లు తెదేపా ఉదాహరణలు చూపించిందని, చంద్రబాబు స్పందించకపోతే ఎన్నికల సంఘంలో ఈ మాత్రం పారదర్శత కూడా వచ్చేది కాదన్నారు.