'అమ్మఒడి'పై సీఎం జగన్ పునరాలోచన చేయాలి: ఏపీ యూటీఎఫ్
పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుకున్నాఅమ్మఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకూ వర్తింప జేయాలన్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో అమ్మఒడి పథకం అమలు చేయడంపై ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాబ్జీ, పి.బాబురెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరిగిందని.. దానికి తగినట్లుగా పాఠశాలలను ఆధునీకరించడం, మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులను నియమించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక ప్రకటించలేదని తెలిపారు. అమ్మఒడి పథకంతో పాటు 25 శాతం మంది విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చితే అది కార్పొరేట్ వారికి లాభం చేకూరుతుందని. ..విద్యార్థుల తల్లిదండ్రులకు లాభం ఉండదన్నారు. ఈ పథకంపై పునః సమీక్ష చేసి కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప జేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.