రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోంది: రామానాయుడు - palakollu mla
పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవి నుంచి వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తెదేపా తప్పుబట్టింది. సమర్థవంతమైన అధికారులను, నవయుగ వంటి ప్రతిష్ఠాత్మక గుత్తేదారులను తొలగిస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
సమర్థవంతమైన అధికారులను వైకాపా ప్రభుత్వం పక్కన పెడుతోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న వెంకటేశ్వరరావును ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించటం అన్యాయమని అన్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి విశేష సేవలు అందించిన వ్యక్తిని పక్కన పెట్టడం సరికాదని ఆక్షేపించారు. పైరవీలు చేసే అధికారులే వైకాపా ప్రభుత్వానికి కావాలని ఆయన ఆరోపించారు. నాణ్యమైన పనులు చేసే నవయుగ, ఎల్ అండ్ టీ, త్రివేణి వంటి గుత్తేదారులను, నాణ్యమైన ఇంజినీర్లను తొలగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. అసమర్థ గుత్తేదారుల వల్ల నాణ్యత లోపిస్తే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడి గోదావరి జిల్లాలపై పడితే సముద్రంలో కలిసే పరిస్థితి ఏర్పడుతుందని రామానాయుడు దుయ్యబట్టారు. పోలవరం సురక్షితంగా ఉంటేనే ఉభయగోదావరి జిల్లాలు బాగుంటాయని.. నాణ్యతపై రాజీపడితే రెండు జిల్లాల్లో ప్రాణ, ఆస్తినష్టం జరిగే అవకాశముందని పేర్కొన్నారు.