Ycp tadikonda politics గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తున్నట్లు.. వైకాపా రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సాధారణంగా పార్టీకి ఎమ్మెల్యే లేని చోట్ల ఇన్‌ఛార్జ్‌లు ఉంటారు. ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. అదనపు ఇన్‌ఛార్జ్‌ను నియమించడం.. రాజకీయంగా కాక రేపింది. డొక్కా నియామక ప్రకటన వెలువడగానే.. శ్రీదేవి విస్తుపోయారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు సుచరిత ఇంటి ఎదుట.. అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. కొందరు నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించి.. రాజీనామాలు చేస్తామని ప్రకటింపజేశారు. అయినా అధిష్ఠానం నుంచి స్పందన రాలేదు. దీంతో శ్రీదేవి ఇంట్లోంచి బయటకు రావడం లేదు. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా ఆపేశారు.
మరోవైపు అదనపు ఇన్‌ఛార్జ్‌గా పార్టీ పదవితో పాటు.. శాసనమండలి విప్‌గానూ డొక్కా డబుల్ ప్రమోషన్ కొట్టేశారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అనుభవం ఆయనకుంది. పాత పరిచయాలుండటంతో ఒక్కసారిగా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో తిరుగుతూ నాయకుల్ని కలుస్తున్నారు. ఎవరికైనా... ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో ఓ స్పష్టత వస్తుంది. కానీ డొక్కా నియామకం ద్వారా... ఈసారి తాడికొండ అభ్యర్థి ఆయనేనన్న సంకేతాలను పార్టీ పంపినట్లయింది. మొదట్లో శ్రీదేవికి మద్దతుగా మాట్లాడిన కొందరు వెనక్కితగ్గారు. తాజాగా ఆమెకు మద్దతుగా మేడికొండూరులో సమావేశం చేపట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అధికార పార్టీ వారినే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడంతో.. ఆమెకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవనే సంకేతాలు పంపినట్లయింది. తాజా పరిణామాలతో శ్రీదేవికి కన్నీరొక్కటే మిగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి అనూహ్యంగా ఉండవల్లి శ్రీదేవి...vవైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె విజయం సంచలనమే అయినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పేకాట శిబిరాల నిర్వహణలో ఆమె పేరు ప్రముఖంగా వినపడింది. ఆమె అనుచరులే ఈ విషయాన్ని బయటపెట్టి.. రచ్చ చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో విభేదాలు, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిలబడి... ఇది అంబేడ్కర్ విగ్రహమే కదా అని అడగటం, మాదిగలు అంబేడ్కర్ కంటే.. జగ్జీవన్ రాం పేరు ఎక్కువగా తలచుకోవాలని ప్రకటించడం వంటివి.. వివాదాల్లోకి లాగాయి. స్థానిక ప్రజాప్రతినిధుల్ని కూడా పట్టించుకోకుండా... ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ శ్రీదేవికి ప్రతికూలంగా మారి... డొక్కాకు మార్గం సుగమం చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.