మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరులోని విద్యానగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 43వ డివిజన్‌కు సంబంధించి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ దొంగ ఓట్లు వేస్తున్న కొందరిని తెదేపా అభ్యర్థి అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం సమీపంలోకి వైకాపా శ్రేణులు భారీగా చేరుకున్నారు. వైకాపా నేతలు రిగ్గింగ్ కోసం యత్నిస్తున్నారని తెదేపా అభ్యర్ధి కొమ్మినేని శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైకాపా అభ్యర్థి వాగ్వాదానికి దిగారు. పోలీసులు తెదేపా అభ్యర్ధిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళనకు యత్నించారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. గొడవ విషయం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అక్కడకు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉండే 43వ డివిజన్లో వైకాపా నేతలు బయటవారిని తీసుకురావడం వల్లే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని గల్లా జయదేవ్ ఆరోపించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా యత్నిస్తోందని గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు.