పల్నాడు జిల్లా నరసరావుపేటలో వ్యక్తి అపహరణ, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన జంగం బాజీ, జంగం రామయ్య అనే అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం :నరసరావుపేటలోని కల్యాణ్ జ్యుయలరీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రామాంజనేయులను ఈనెల 22న కొందరు అపహరించారు. నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత రామాంజనేయులును హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కుక్కి. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద.. జాతీయ రహదారి పక్కనున్న వంతెన కింద పడేశారు. ఈ హత్య నగరంలో కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ అనంతరం.. రామాంజనేయులు హత్యలో రాజకీయ కోణం లేదని డీఎస్పీ వెల్లడించారు. పాత కక్షలే అతని హత్యకు కారణమని దర్యాప్తులో తేల్చారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందని వెల్లడించారు. జంగం సోదరులు, రామాంజనేయులుకు మధ్య గతంలో గొడవలున్నాయని తెలిపారు. జంగం బాజీ మరో సోదరుడు చంటిబాబు కొన్నాళ్లుగా కనిపించకుండా పోయాడని, చంటిబాబు అదృశ్యం వెనుక రామాంజనేయులు హస్తముందని అనుమానించిన జంగం బాజీ, జంగం రామయ్య రామాంజనేయులుని ఈనెల 22న అపహరించారని పోలీసులు తెలిపారు. చంటిబాబు ఆచూకీ చెప్పాలని రామాంజనేయులును అపహరించిన జంగం బాజీ, రామయ్య.. అనంతరం హత్య చేశారని పోలీసులు ప్రకటించారు. ఈ హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్న జంగం బాజి, జంగం రామయ్య అరెస్టు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ విజయ్‌భాస్కర్.. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.