ఆచార్యుల ఆలోచన.. అతిథులకు ఖాళీ మద్యం సీసాలు బహూకరణ!
ఏదైనా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పూల బొకేలు, వివిధ రకాల మెమెంటోలు ఇవ్వటం మామూలే. కానీ తాగి పాడేసిన మద్యం బాటిళ్లను మెమెంటోలుగా మార్చి తమ సృజన చాటుకున్నారు గుంటూరు వైద్య కళాశాల ఆచార్యులు. ఖాళీ మద్యం బాటిళ్లకు అందమైన పెయింటింగ్లు వేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
పూల బొకేలు ఇస్తే కాసేపటికే వాడిపోతాయి. మెమెంటోలు ఇస్తే వాటిని తమ ఇళ్లలో ప్రదర్శించేందుకు చాలా మంది ఆసక్తి చూపరు. అందుకే గుంటూరు వైద్య కళాశాల ఆచార్యులు వినూత్నంగా ఆలోచించారు. ఖాళీ మద్యం సీసాలకు కొత్త రంగులు జోడించి తమ అతిథులకు జ్ఞాపికలుగా అందజేశారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనం. పూల బొకేల ఖర్చు కలిసి రావటం మొదటిదైతే.... చెత్తలో పడేయాల్సిన వాటిని పునర్వినియోగంలోనికి తీసుకురావటం రెండోది. దీని ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్టూ అవుతుంది. ఆచార్యుల ఆలోచనకు హ్యాట్సాఫ్!