గుంటూరు సర్వజనాసుపత్రి మార్చురీలో మృతదేహాలు పేరుకుపోయాయి. సుమారు 45 మృతదేహాలతో మార్చురీ గదులు నిండిపోయాయి. సామర్ధ్యానికి మించి మృతదేహాలు పేరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో 15 మృతదేహాలు కరోనా కేసులు కావడంతో వాటిని తీసుకెళ్లేందుకు బంధువులు విముఖత చూపించారు. వారికి సమాచారం ఇస్తున్నప్పటికీ మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఈ మృతదేహాలను ఎలా తరలించాలనే విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ... జీజీహెచ్ మార్చురీలో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితిపై ఆరా తీశారు. దీనిపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని.. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి వారి నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మోపిదేవి తెలిపారు. ఎవరూ రక్తసంబధీకులు లేకపోయిన పక్షంలో ప్రభుత్వ యంత్రాంగమే ఆ మృతదేహాలను ఖననం చేస్తుందని తెలిపారు.